
కోయంబత్తూరు: మన దేశ రక్షణ శాఖ సమాచారాన్ని ఒక పాకిస్తానీ మహిళా గూఢచారికి లీక్ చేసినందుకు 31 ఏళ్ల భారత నావికాదళ సైనికుడిని శనివారం కోయంబత్తూరులో అరెస్టు చేశారు. ఆ మహిళా గూఢచారి సదరు నేవీ అధికారిని హనీట్రాప్‌లోకి లాగింది.
కోయంబత్తూరులోని రెడ్ ఫీల్డ్స్‌లో ఉన్న ప్రముఖ నావికాదళ నాయకత్వ శిక్షణా సంస్థ అయిన ఐఎన్ఎస్ అగ్రానిలో మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ కోర్సు చేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రదీప్ ముఖర్జీని ఆంధ్రప్రదేశ్ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ (సిఐ) సెల్ అరెస్టు చేసింది.
2014లో భారత నావికాదళంలో నావికుడిగా నియమితుడైన ప్రదీప్, విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే తూర్పు నావికా కమాండ్ కింద నావికుడిగా రిక్రూట్ కావడం గమనార్హం. అతను ఒక కోర్సు చేసేందుకు వారం క్రితమే ఐఎన్ఎస్ అగ్రానికి వెళ్లాడు. కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో తనను సంప్రదించిన ఒక పాకిస్తానీ మహిళా ఏజెంట్ పన్నిన ఆన్‌లైన్ హనీట్రాప్‌కు ప్రదీప్ చేపలా చిక్కాడు. సదరు మహిళా పాకిస్తానీ ఏజెంట్ క్రమంగా ఆ నావికుడితో స్నేహం చేసింది.
విశాఖపట్నం నావికా స్థావరానికి సంబంధించిన వ్యూహాత్మక నావికా ఆస్తులు, నౌకాదళ కదలికలు, కార్యకలాపాలకు సంబంధించిన సున్నితమైన వివరాలను రాబట్టింది. ఉగ్రవాద ముఠాలు, సరిహద్దు గూఢచర్యం, అధిక భద్రతా ముప్పులను నిర్మూలించడంపై దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఉన్నత విభాగమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ (CI) సెల్, అనుమానాస్పద డిజిటల్ ఆనవాళ్లను గుర్తించిన తర్వాత ప్రదీప్ ముఖర్జీపై నిఘా పెట్టింది.
►ALSO READ | సీబీఐ, ఈడీ లాగే.. ఎన్నికల సంఘం కూడా మోడీ, బీజేపీ కనుసన్నల్లో నడుస్తోంది: ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల
రహస్య సమాచారాన్ని చేరవేయడంలో అతని పాత్ర నిర్ధారణ అయిన తర్వాత, దర్యాప్తు అధికారులు అతడిని అరెస్టు చేయడానికి నావికా దళ అధికారుల నుంచి అనుమతి పొందారు. శనివారం ఉదయం కోయంబత్తూరులోని ఐఎన్ఎస్ అగ్రాని దగ్గరకు ఒక ప్రత్యేక సీఐ బృందం చేరుకుని అతడిని అదుపులోకి తీసుకుంది.
ఈ అరెస్ట్ గురించి స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించారు. తదుపరి కస్టడీ విచారణ కోసం సాయంత్రం విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లే ముందు, ట్రాన్సిట్ వారెంట్ పొందేందుకు దర్యాప్తు అధికారులు ఆ నావికుడిని స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.