
ఒకప్పుడు మన దేశంలో వినోదానికి, వార్తలకు దూరదర్శన్ (DD National) మాత్రమే ఏకైక ఆధారం. ఆ రోజుల్లో టీవీలో వచ్చే కొన్ని కార్యక్రమాల కోసం జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఆ కాలంలో రామాయణం, మహాభారతం, శక్తిమాన్ వంటి సీరియల్స్ వస్తున్నాయంటే చాలు, వీధుల్లో జనం ఉండేవాళ్ళు కాదు, అందరూ టీవీల ముందు వచ్చి కూర్చునేవాళ్ళు. అయితే, ఇదంతా ఒక ఎత్తైతే… దూరదర్శన్‌లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం వస్తే మాత్రం, చాలామంది వెంటనే టీవీలను ఆపేసేవారట! అదే ‘క్రిషి దర్శన్’ (Krishi Darshan) అనే కార్యక్రమం.
టీవీలు ఎందుకు ఆపేసేవారు?
‘క్రిషి దర్శన్’ ప్రోగ్రాం అనౌన్స్‌మెంట్ రాగానే చాలామంది టీవీ కట్టేయడానికి కారణం దానిలోని విషయమే. ఈ షో పూర్తిగా వ్యవసాయం, రైతులు, పంటలు, ఆధునిక సాగు పద్ధతుల గురించే ఉండేది. ఇందులో ఒక యాంకర్, ఒక వ్యవసాయ నిపుణుడు కలిసి కూర్చుని, దేశంలోని రైతులకు వ్యవసాయ మెలకువలు, సలహాలు చెప్పేవేవారు.
వినోదం కోసం ఎదురుచూసే సాధారణ ప్రేక్షకులకు ఇది కాస్త బోరింగ్‌గా అనిపించడంతో, ఆ టైమ్‌లో టీవీలు బంద్ చేసేవారు. కానీ, మన దేశంలోని రైతన్నలకు మాత్రం ఇది ప్రాణంతో సమానం. వారు దీన్ని ఎంతో శ్రద్ధగా చూసి, వ్యవసాయంలో కొత్త పద్ధతులు నేర్చుకునేవారు.
అరుదైన రికార్డు.. నెం. 1 షో!
సాధారణ ప్రజలు ఆ సమయంలో టీవీలు ఆపేసినప్పటికీ, రైతుల ఆదరణతో ఈ కార్యక్రమం చరిత్ర సృష్టించింది. గత 59 సంవత్సరాలుగా ఏకధాటిగా ప్రసారమవుతూ వస్తున్న ‘క్రిషి దర్శన్’, దూరదర్శన్ చరిత్రలోనే అత్యధిక ఎపిసోడ్‌లు ప్రసారమైన కార్యక్రమంగా మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ షో 16 వేలకు పైగా ఎపిసోడ్‌లను పూర్తి చేసుకొని ఒక అరుదైన చారిత్రాత్మక రికార్డును తన పేరున లిఖించుకుంది.