Reading Time: < 1 minute
Honor X5ds Price Specs Features

ఆనర్ సంస్థ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా ‘ఆనర్ X5ds’ను సౌతాఫ్రికా మార్కెట్లో విడుదల చేసింది. తక్కువ ధరలో లభించే ఈ ఫోన్‌లో అత్యంత ప్రత్యేకతగా వెనకవైపు చిన్న కలర్ స్క్రీన్‌ను అందించారు. సాధారణంగా ఈ ఫీచర్ ఖరీదైన ప్రీమియం ఫోన్లలో కనిపిస్తుంది. ఫారెస్ట్ గ్రీన్ , మిడ్‌నైట్ బ్లాక్ కలర్స్‌లో లభించే ఈ ఫోన్ 4GB+64GB వేరియంట్ ధర సుమారు ZAR 2,499 (భారత కరెన్సీలో దాదాపు రూ. 14,500)గా ఉంది. అయితే దీన్ని ఇతర దేశాల్లో విడుదల చేసే విషయాలపై ఇంకా స్పష్టత లేదు.

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ అయిన వెనుక డిస్‌ప్లే 2.01 అంగుళాల సైజుతో, 240×296 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. దీని ద్వారా వెనుక కెమెరా సహాయంతో సులభంగా సెల్ఫీలు తీసుకోవచ్చు, కాల్ అలర్ట్స్ చూసుకోవచ్చు, మీడియా ప్లేబ్యాక్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఇక ముందుభాగంలో 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కూడిన పెద్ద 6.78 అంగుళాల ఎల్‌‌సీడీ మెయిన్ డిస్‌ప్లే ఉంది. పనితీరు కోసం ఈ ఫోన్ యూనిసోక్ T610 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అదనంగా 4GB వర్చువల్ మెమరీ, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ పెంచుకునే సదుపాయం ఉంది.

ఫొటోగ్రఫీ పరంగా ఇందులో f/1.8 అపర్చర్‌ కలిగిన 50 మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, అలాగే ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ రెండు కెమెరాలు 1080p వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 6,000mAh శక్తివంతమైన బ్యాటరీని 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇచ్చారు. ఇది ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్ ఇవ్వబడింది. 4G LTE, వై-ఫై, బ్లూటూత్ 5.0, టైప్-C పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.