
‘చుట్టమల్లే’ మార్ఫింగ్ వీడియో వివాదంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. బాధితురాలికి అండగా నిలిచే క్రమంలో సెలబ్రిటీలు చేసిన సోషల్ మీడియా పోస్టులే.. చివరకు ఆ అభ్యంతరకరమైన కంటెంట్‌కు మరింత ప్రచారం కల్పించాయని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. అసలు నిందితుడిని గుర్తించి పట్టుకోవడంపై దృష్టి పెట్టాల్సింది పోయి, బాధితురాలి గుర్తింపుతో పాటు అభ్యంతరకర కంటెంట్‌పై కోట్లాది మంది దృష్టి పడేలా చేశారంటూ ఆయన ప్రముఖుల తీరును ప్రశ్నించారు.
‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం టాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. అసభ్యకరంగా మార్ఫ్ చేసిన ఈ వీడియోపై జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోస్టులు చేశారు. దీంతో ఈ వివాదం సోషల్ మీడియాలో మరింతగా వైరల్ అయింది.
ఇదే సమయంలో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో కోణాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. ప్రముఖులు స్పందించిన తీరు వల్ల అసలు సమస్య పరిష్కారం కావడం కంటే.. వివాదాస్పద లింక్, కంటెంట్ మరింత మందికి చేరే అవకాశం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ‘నిందితుడిని పట్టుకున్న విషయాన్ని ప్రచారం చేసి ఉంటే అదే తెలివైన పని అయ్యేది’ అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.
“ప్రముఖులంతా కలిసి సాధించింది ఒక్కటే.. నిందితుడిని పట్టుకోవడం కంటే, అభ్యంతరకరమైన లింక్‌కు కోట్లాది మందిలో ఉచిత ప్రచారం కల్పించడమే. నిందితుడి కోసం వేట సాగించి, అతడిని పట్టుకున్న విషయాన్ని ప్రపంచానికి చెప్పి ఉంటే అది నిజమైన తెలివైన చర్య అయ్యేది. కానీ అందుకు విరుద్ధంగా ట్వీట్ల పేరుతో బాధితురాలి గుర్తింపును, నేరంగా పరిగణించాల్సిన అభ్యంతరకరమైన కంటెంట్‌ను మరింత మందికి చేరేలా చేశారు. సమస్యను ఆపాల్సింది పోయి.. సమస్యకే మరింత ప్రచారం కల్పించినట్టయింది.” అని ఆర్జీవీ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
The only thing all the celebrities succeeded in , is to publicise and thereby make crores and crores of people see the objectionable link ..The smart thing would have been to concentrate on catching the perpetrator and publicise that ..Instead what they did is to tweet and bring…
— Ram Gopal Varma (@RGVzoomin) October 4, 2026
బాధితురాలికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో చేసే సోషల్ మీడియా పోస్టులు.. అనుకోకుండా బాధితురాలి గుర్తింపును, అభ్యంతరకర కంటెంట్‌ను మరింత వైరల్ చేసే పరిస్థితి తీసుకురాకూడదని ఆర్జీవీ వ్యాఖ్యల సారాంశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సెలబ్రిటీల స్పందనలపై ఆర్జీవీ చేసిన ఈ కౌంటర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ఇస్యూ ఎంతవరకు వెళుతుందని అనేది తెలియాల్సి ఉంది.