Reading Time: < 1 minute
Flydubai Attack Al Qaida Support Publication Calls For Copycat Plane Attacks

Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. భారత పైలట్ సాహసంతో విమానం ప్రమాదం నుంచి బయటపడింది. ఒమన్ జాతీయుడైన కో-పైలట్ దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. అయితే, ఇప్పుడు ఈ ఘటనలకు ఉగ్రసంస్థ అల్‌ఖైదా మద్దతు తెలిపింది. యుద్ధం ఇంకా ముగియలేదని చెబుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ ప్రజలు ప్రయాణించే విమానాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులు చేస్తామని హెచ్చరించింది. అమెరికాపై 2001లో జరిగిన 9/11 దాడులను కూడా అల్‌ఖైదా అనుకూల వారపత్రిక ‘అల్-బయాన్’ ప్రస్తావించింది.

సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి, కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసిన ఘటనను 9/11 దాడులతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసింది. అమెరికన్లు, ఇజ్రాయిలీలుల ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, ఇప్పటికీ వీరు ప్రయాణిస్తున్న చాలా విమానాలు ఆకాశంలో ఉన్నాయని హెచ్చరించింది. యూఎస్ రాజ్యం చివరకు అంతమవుతుందని చెప్పింది. అమెరికా, ఇజ్రాయిల్‌లకు గతంలో కన్నా ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని అల్ బయాన్ పేర్కొంది. ఇదిలా ఉంటే, నిందితుడైన కో పైలట్ హమ్మామి సోషల్ మీడియాలో అల్‌ఖైదా నేతలు ఒసామా బిన్ లాడెన్, అల్ జవహరిల ప్రస్తావన ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం.