
AP Housing: ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం వేదికగా కొత్తగా మంజూరైన 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ఆధునిక సాంకేతికతను ఉపయోగించే దిశగా 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ పైలట్ ప్రాజెక్ట్‌కు కూడా శ్రీకారం చుట్టారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, CSIR-CBRI రూర్కీ, ఏపీ ప్రభుత్వం కలిసి ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నాయి.
3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) 2.0 కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇటీవల 3 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని మరిన్ని ఇళ్లు మంజూరు చేయాలని కోరగా ఈ కేటాయింపు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణానికి బుర్రిపాలెంలో జరిగిన కార్యక్రమం ద్వారా అధికారికంగా పనులు ప్రారంభమయ్యాయి. పేద కుటుంబాలకు సొంత ఇల్లు అందించడంతో పాటు, గ్రామీణ గృహ నిర్మాణంలో వేగాన్ని పెంచడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
ఇప్పటికే 5.50 లక్షల ఇళ్లు అందజేత
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 5.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది నవంబర్‌లో 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించగా, ఈ ఏడాది మార్చిలో మరో 2.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్లు సమాచారం. ప్రస్తుతం మరో 4.20 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటిని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
3D టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం
ఈ కార్యక్రమంలో మరో ప్రత్యేక ఆకర్షణ 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ. బుర్రిపాలెం, ఒబులనాయుడుపాలెం గ్రామాల్లో మొత్తం 175 ఇళ్లను ఈ సాంకేతికతతో నిర్మించేందుకు పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.13.93 కోట్లు కాగా, పన్నులతో కలిపి సుమారు రూ.14 కోట్లుగా పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టులో 100 ఇళ్లను సుమారు 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, మరో 77 ఇళ్లను దివ్యాంగులకు అనుకూలంగా సుమారు 32 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే ప్రణాళిక ఉంది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం కూడా కల్పించనున్నారు.
కేంద్రం, రాష్ట్రం కలిసి చేపడుతున్న ప్రాజెక్ట్
ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, CSIR-CBRI రూర్కీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి చేపడుతున్నాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం, రాష్ట్రం రెండూ భాగస్వామ్యం వహిస్తున్నాయి. 3D ప్రింటింగ్ యంత్రాల కొనుగోలు, సాంకేతిక పర్యవేక్షణ, నిర్మాణ పనులు తదితర అంశాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. బుర్రిపాలెం, ఒబులనాయుడుపాలెంలో చేపడుతున్న 177 ఇళ్ల నిర్మాణం పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. ఈ ప్రయోగం ద్వారా 3D టెక్నాలజీతో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లను ఎంత వేగంగా, నాణ్యతతో, సమర్థవంతంగా నిర్మించవచ్చో అంచనా వేయనున్నారు.
ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్‌లో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ గృహ నిర్మాణ కార్యక్రమాల్లో ఈ సాంకేతికతను ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ గృహ నిర్మాణంలో ఈ విధానాన్ని విస్తరించేందుకు అవసరమైన సాంకేతిక ప్రమాణాలను కూడా ఈ పైలట్ ద్వారా అభివృద్ధి చేయనున్నారు.