Reading Time: 2 minutes

తల వెనుక బలంగా దెబ్బ.. ఆపకుండా కొడుతూనే ఉన్నాడు: దాడి ఘటనపై నెతన్యాహుతో స్మిత్ మచ్చర్

Caption of Image.

ఫ్లైదుబాయ్ విమానంలో కాక్‌పిట్ దాడి ఘటనకు సంబంధించి భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ కీలక విషయాలను వెల్లడించారు. యూఏఈలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మచ్చర్‌తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా దాడి ఎలా జరిగిందో మచ్చర్ వివరించారు.

కో-పైలట్ ప్రార్థన చేసుకునేందుకు సమయం కోరడంతో ఘటన ప్రారంభమైందని మచ్చర్ చెప్పారు. అందులో తనకు ఎలాంటి అనుమానం రాలేదని తెలిపారు. అయితే కొన్ని నిమిషాల తర్వాత తన తల వెనుక భాగంలో ఒక్కసారిగా బలమైన దెబ్బ తగిలిందని చెప్పారు. ఆ తర్వాత కూడా కో-పైలట్ వరుసగా దాడి చేస్తూనే ఉన్నాడని వివరించారు. దెబ్బల కారణంగా తన చూపు మసకబారిందని, ఆ సమయంలో విమానం వేగంగా కిందికి పడిపోతుండటంతో తన జ్ఞాపకాలు కూడా పూర్తిగా స్పష్టంగా లేవని తెలిపారు.

విమానం సమస్య కారణంగా కాకుండా కో-పైలట్ దాడి చేస్తున్నాడని గుర్తించిన మచ్చర్, అతడిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ చివరి శక్తిని కూడగట్టుకుని కాక్‌పిట్ తలుపు తెరిచేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. తాను కాక్‌పిట్ నేలపై పడిపోయి ఉన్న సమయంలో విమానం గాలి శబ్దంతో పాటు ప్రయాణికుల అరుపులు వినిపించాయని గుర్తుచేసుకున్నారు.

‘నాలో చివరి పోరాడాల్సి వచ్చింది. అలా చేయకపోతే నేను చనిపోతానని తెలుసు’’ అని మచ్చర్ తెలిపారు. చివరకు తన శక్తినంతా ఉపయోగించి కాక్‌పిట్ తలుపు తెరిచానని, బయట ప్రయాణికులు ఉండటంతో పరిస్థితి మారిందని చెప్పారు.

ఈ ఘటనపై యూఏఈ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కో-పైలట్ కెప్టెన్‌పై కాక్‌పిట్‌లోని అత్యవసర గొడ్డలితో దాడి చేసి, విమానం నియంత్రణను తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడని యూఏఈ అటార్నీ జనరల్ హమద్ సైఫ్ అల్ షమ్సీ తెలిపారు. ఈ చర్యను అధికారులు ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. అయితే దాడి వెనుక ఉద్దేశం ఏమిటన్నది ఇంకా వెల్లడించలేదు. కో-పైలట్ ప్రస్తుతం యూఏఈ అదుపులో ఉన్నాడు.

©️ VIL Media Pvt Ltd.