
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరోసారి తన కపట బుద్ధి బయటపెట్టింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్‌లోకి మళ్లీ వెళ్లకుండా కొత్త వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా జైష్-ఎ-మహమ్మద్ చీఫ్, వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్‌పై బౌంటీని రూ.70 లక్షలకు పెంచింది. ఈ మేరకు పాకిస్థాన్‌కు చెందిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది. కాగా, గతంలోనే మసూద్ అజార్‌ను పట్టించినవారికి పాకిస్తాన్ రూ.50 లక్షల రివార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దానిని మరో రూ.20 లక్షలు పెంచింది. 2026, అక్టోబర్‌లో జరగనున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్లీనరీ సమావేశానికి ముందే పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం టెర్రరిజంపై దాయాది దేశ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శమని విమర్శిస్తున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు.
పాక్‌కు గ్రే లిస్ట్ భయం:
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) ప్రపంచవ్యాప్తంగా మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వంటి చట్టవిరుద్ధమైన ఆర్థిక కార్యకలాపాలను పరిశీలిస్తుంది. ఆర్థిక నేరాల నియంత్రణలో విఫలమయ్యే లేదా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే దేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్, గ్రే పేరిట రెండు జాబితాలను ప్రకటిస్తుంది. ఒక దేశం ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లేదా గ్రే లిస్ట్‌లో చేరితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతినడంతో పాటు తీవ్ర ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొవాల్సి ఉంటుంది.
►ALSO READ | ఇండోనేసియాలో నౌక బోల్తా.. ఆరుగురు మృతి, 130 మంది గల్లంతు
ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లేదా గ్రే లిస్ట్‌లో చేర్చిన దేశాలకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), ప్రపంచ బ్యాంక్ (World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) వంటి గ్లోబల్ సంస్థలు రుణాలు ఇవ్వవు. ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా పేరుగాంచిన పాకిస్తాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ గతంలో గ్రే లిస్ట్‌లో చేర్చింది. దీంతో దాయాది దేశం అంతర్జాతీయంగా అప్పులు పుట్టక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అష్టకష్టాల మీద గ్రే లిస్ట్ నుంచి బయటపడింది.
2026, అక్టోబర్‌లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్‌పై బౌంటీని పాకిస్తాన్ రూ.70 లక్షలకు పెంచింది. గ్రే లిస్ట్ భయంతోనే పాక్ ఈ డబుల్ గేమ్ ఆడుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉగ్రవాదులపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకుంటోందనే అభిప్రాయాన్ని కలిగించి అంతర్జాతీయ పరిశీలన నుంచి తప్పించుకోవడమే లక్ష్యంగా ఈ పాక్ కపట కుట్రకు తెరలేపింది.