
Director Shouryuv: భారతీయ చలనచిత్ర రంగంలో పౌరాణిక కథలకు, యానిమేషన్ విజువల్ వండర్స్‌కు సరికొత్త క్రేజ్ స్టార్ట్ అయిన వేళ.. ఇండస్ట్రీని షేక్ చేసే క్రేజీ అప్‌డేట్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ‘హాయ్ నాన్న’ చిత్రంతో ఎమోషన్స్‌ను పండించి తన ఫస్ట్ సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సెన్సేషనల్ డైరెక్టర్ శౌర్యువ్, ఇప్పుడు భారత ఇతిహాసాల్లోని అత్యంత శక్తిమంతమైన పాత్రపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మహాభారతంలో వీరత్వానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచిన అజేయ యోధుడు ‘కర్ణుడి’ కథ ఆధారంగా ఆయన ఓ భారీ విజువల్ స్పెక్టాకిల్‌ను తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను గ్లోబల్ స్ట్రీమింగ్ జెయింట్ ‘నెట్‌ఫ్లిక్స్’ సమర్పిస్తుండగా, యానిమేషన్ రంగంలో తిరుగులేని పేరున్న ‘చిలక ప్రొడక్షన్స్’ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోందని తెలుస్తోంది. సాధారణంగా ఓటీటీ ప్రాజెక్టులు డిజిటల్ స్క్రీన్‌లకే పరిమితమవుతుంటాయి. అయితే ఇటీవల వచ్చిన ‘మహావతార్ నరసింహ’ యానిమేషన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టించడంతో, మేకర్స్ తమ రూటు మార్చారు. కర్ణుడి జీవిత కథతో తెరకెక్కించబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను కేవలం ఓటీటీ కోసమే కాకుండా, మునుపెన్నడూ చూడని రీతిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోనే గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని నిర్ణయించారని టాక్.
‘మహావతార్ నరసింహ’ స్థాయిని మించేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హై-ఎండ్ 3D యానిమేషన్, అడ్వాన్స్‌డ్ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) టెక్నాలజీని కర్ణుడి చిత్రం కోసం ఉపయోగిస్తున్నారట. భారతీయ పౌరాణిక గాథలను గ్లోబల్ ఆడియన్స్‌ను సైతం మెప్పించే సరికొత్త కోణంలో ఆవిష్కరించేందుకు చిలక ప్రొడక్షన్స్ సరికొత్త ప్రొడక్షన్ పైప్‌లైన్‌ను రెడీ చేస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ లార్జర్-దేన్-లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ఈ విజువల్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. కర్ణుడి జీవితంలోని ఉద్వేగభరితమైన పోరాటం, అసమాన త్యాగం, దానగుణం.. అలాగే కురుక్షేత్ర సంగ్రామంలోని భీకర యాక్షన్ సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్‌లో ఎలివేట్ చేసేందుకు మేకర్స్ పక్కా స్కెచ్ వేసినట్లు సమాచారం. ఈ ఎమోషనల్ డ్రామాను గుండెలకు హత్తుకునేలా మార్చేందుకు ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ను కూడా రంగంలోకి దించుతున్నట్లు టాక్. ఎమోషనల్ డ్రామాను డీల్ చేయడంలో శౌర్యువ్ ట్రాక్ రికార్డ్, చిలక ప్రొడక్షన్స్ విజువల్ టెక్నాలజీ, నెట్‌ఫ్లిక్స్ భారీ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కలగలిసి వస్తుండటంతో.. కర్ణుడిపై రాబోయే ఈ చిత్రం వెండితెరపై సరికొత్త మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.