Reading Time: 2 minutes

తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని గణనాథుడిని కోరుకున్న: మంత్రి వివేక్

Caption of Image.

మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ చౌరస్తా, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో మహా గణపతి మండలి కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచంలోని పలు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని గణనాథుడిని కోరుకున్నానని తెలిపారు.ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాలు తక్కువగా కురిశాయని, రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండకపోతే వచ్చే వేసవిలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంపై తీసుకోవాల్సిన చర్యలపై తదుపరి కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు.గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఇదే విధంగా కొనసాగాలని విఘ్నేశ్వరుడిని కోరుకున్నానని మంత్రి తెలిపారు.

దళితులు ధర్నా చేసిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. దళితుల పట్ల బీఆర్‌ఎస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.ఆత్మగౌరవం కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సామాజిక వివక్షకు చోటు కల్పించడం తెలంగాణ సమాజం తలదించుకునే దుర్ఘటన అని అన్నారు. రాబోయే రోజుల్లో దళితులే బీఆర్‌ఎస్ పార్టీని రాజకీయంగా శుద్ధి చేస్తారని వ్యాఖ్యానించారు.వచ్చే ఎన్నికల్లో దళితుల ఓట్లతో బీఆర్‌ఎస్ పార్టీకి గుణపాఠం చెబుతారని మంత్రి అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ఈ ఘటనపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇది కేవలం ఒక్క కులానికి జరిగిన అవమానం కాదని.. రాజ్యాంగ వ్యవస్థను, అసెంబ్లీ గౌరవాన్ని, లక్షలాది మంది దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య అని మంత్రి పేర్కొన్నారు.

ప్రజల సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతోందని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ప్రజాపాలనను ఎదుర్కొనే సత్తా లేక అసెంబ్లీ ముందు అల్లర్లు సృష్టిస్తూ టైమ్‌పాస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతానని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.

©️ VIL Media Pvt Ltd.