Reading Time: < 1 minute
Mohammad Kaif Questions Sanju Samson Vaibhav Sooryavanshi

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సంజు శాంసన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడంపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశవాళీ లేదా ఇతర క్రికెట్ ఆడకుండానే శాంసన్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌కు 7 వికెట్ల తేడాతో విజయం అందించినప్పటికీ, సంజు శాంసన్ వైఫల్యం, యవ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజు శాంసన్ కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు. టీ20 ప్రపంచ కప్ తర్వాత శాంసన్ ఆడిన గత ఐదు మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా కనీసం 30 పరుగుల మార్క్‌ను కూడా అందుకోలేకపోయారు. జట్టు నుంచి డ్రాప్ అయిన తర్వాత శాంసన్ ఎలాంటి మ్యాచ్‌లు ఆడి ఫామ్‌లోకి రాలేదని, అయినప్పటికీ అతనికి తుది జట్టులో ఎలా చోటు దక్కిందంటూ కైఫ్ నిలదీశారు.

మరోవైపు, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇటీవలి కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. గతంలో జింబాబ్వే పర్యటనలో అరుదైన ప్రతిభ కనబరిచిన వైభవ్, మూడు మ్యాచ్‌లలో మొత్తం 151 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌కు సూర్యవంశీని ఎంపిక చేసినప్పటికీ, మేనేజ్‌మెంట్ ఆయనకు బదులుగా శాంసన్‌ వైపే మొగ్గు చూపింది. జింబాబ్వేలో అద్భుతంగా రాణించి మ్యాచులు గెలిపించిన తనకు తుది జట్టులో ఎందుకు అవకాశం దక్కలేదనే ప్రశ్న వైభవ్ మనసులో మెదిలే అవకాశం ఉందని, ఆయన అడిగే ఈ ప్రశ్నలో ఎంతో సమంజసం ఉందని కైఫ్ అభిప్రాయపడ్డారు.

భారత జట్టు మేనేజ్‌మెంట్ ప్రస్తుతం సరైన ఓపెనింగ్ కాంబినేషన్ ఏమిటనే విషయంలో కొంత గందరగోళానికి గురవుతోందని కైఫ్ విశ్లేషించారు. సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలలో తుది జట్టులో ఎవరు ఓపెనర్లుగా ఉండాలనే దానిపై స్పష్టత కొరవడినట్లు స్పష్టమవుతోంది. జట్టు విజయం సాధించినప్పటికీ, ఇన్-ఫార్మ్ ఆటగాడిని పక్కనపెట్టి ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న సీనియర్ ఆటగాడికి అవకాశాలు ఇవ్వడంపై వ్యక్తవుతున్న ఈ సందేహాలకు రాబోయే మ్యాచ్‌లలో జట్టు మేనేజ్‌మెంట్ ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.