Reading Time: 2 minutes

కొత్త సంవత్సరంలోనో లేదా ఏదైనా పండగ తర్వాతో చాలామంది మంచి రోజు చూసుకొని మరి ఎంతో ఉత్సాహంగా జిమ్ ఫీజులు కట్టేస్తుంటారు. మొదటి రెండు రోజులు బాగానే ఉంటుంది కానీ, ఆ తర్వాత పొద్దున్నే లేవలేక, సమయం కుదరక జిమ్‌కు వెళ్లడం మానేస్తారు. ఫలితంగా డబ్బులు దండగ అవ్వడమే కాకుండా ఒళ్లు నొప్పులు మాత్రమే మిగులుతాయి. అందుకే జిమ్‌లో చేరేముందు మీ శరీరాన్ని, సమయాన్ని పరీక్షించుకోవడానికి ఒక చిన్న టెస్ట్ చేయాలి. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఉత్సాహం ఓకే.. అలవాటు ఉందా?: కొత్తగా ఫిట్‌నెస్ ప్రయాణం ప్రారంభించేటప్పుడు మనలో ఉత్సాహం ఆకాశాన్ని తాకుతుంది. కానీ ఆ ఉత్సాహం నిలకడగా ఉండటమే ఇక్కడ అసలైన సవాలు. చాలామంది మొదటి రోజే కఠినమైన వర్కౌట్లు చేసి, మరుసటి రోజు నుంచి లేవలేక ఆపేస్తుంటారు. జిమ్‌కు వెళ్లడం అనేది ఒక్క రోజుతో పూర్తయ్యే పని కాదు, అదొక నిరంతర అలవాటు. అందుకే డబ్బులు చెల్లించే ముందే మనకు ఆ క్రమశిక్షణ ఉందో లేదో పరీక్షించుకోవడం చాలా ముఖ్యం.

ఇంట్లోనే 10 రోజుల టెస్ట్: మీరు జిమ్‌లో చేరాలని అనుకుంటే, ముందుగా ఒక వారం లేదా పది రోజుల పాటు ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు ప్రారంభించండి. మీరు ఏ టైమ్‌లో జిమ్‌కు వెళ్లాలనుకుంటున్నారో, సరిగ్గా అదే టైమ్‌కు నిద్రలేచి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ఇక ఇంట్లో ఉండి సాధారణ వాకింగ్, స్ట్రెచింగ్స్ లేదా ఫ్రీ-హ్యాండ్ ఎక్సర్‌సైజెస్ చేయడం ద్వారా మీ శరీరాన్ని ముందుగా సిద్ధం చేయవచ్చు.

ఈ టెస్ట్ వల్ల లాభాలేంటి?: ఈ పది రోజుల వ్యవధిలో మీరు ఆ సమయాన్ని క్రమం తప్పకుండా కేటాయించగలుగుతున్నారా లేదా అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రోజూ అనుకున్న సమయానికి లేవగలుగుతున్నారా, మీ రోజువారీ పనుల మధ్య వ్యాయామానికి టైమ్ దొరుకుతుందా లేదా అనేది తెలిసిపోతుంది. ఈ చిన్న టెస్ట్ పాస్ అయ్యాకే జిమ్ సభ్యత్వం తీసుకోవడం సరైన నిర్ణయం.

New to the Gym? Check Your Fitness Level With This Easy Test
New to the Gym? Check Your Fitness Level With This Easy Test

మయం, డబ్బు ఆదా: ఈ పద్ధతిని పాటించడం వల్ల రెండు ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మీరు క్రమం తప్పకుండా వెళ్లగలరనే నమ్మకం వచ్చాకే డబ్బులు కడతారు కాబట్టి మీ కష్టార్జితం వృథా కాదు. రెండోది, ఆకస్మికంగా భారీ బరువులు ఎత్తడం వల్ల వచ్చే తీవ్రమైన ఒళ్లు నొప్పులు నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు. ముందుగా శరీరం కాస్త ఫ్లెక్సిబుల్‌గా మారి జిమ్ వర్కౌట్లకు సిద్ధమవుతుంది.

మనస్సును సిద్ధం చేసుకోండి: శరీరంతో పాటు మనస్సును కూడా సిద్ధం చేయడం అవసరం. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవడం వల్ల మానసికంగా కూడా వ్యాయామంపై ఆసక్తి పెరుగుతుంది. ఇక ప్రతిరోజూ ఒకే సమయానికి శరీరాన్ని కదిలించడం వల్ల జీవక్రియలు మెరుగవుతాయి. ఇలా ముందస్తు ప్రణాళికతో అడుగులు వేస్తే జిమ్‌కు వెళ్లడం ఒక భారంగా కాకుండా, రోజూ ఆనందంగా చేసే ఒక మంచి అలవాటుగా మారుతుంది.

ఇక ఆరోగ్యంగా ఉండాలనే తపన ప్రశంసనీయమైనదే, కానీ దానికి సరైన ప్రణాళిక తోడవ్వాలి. జిమ్‌లో చేరి మధ్యలోనే ఆపేయడం కంటే, ముందుగా ఇంట్లోనే చిన్న టెస్ట్ చేసుకుని, అలవాటు పడ్డాక జిమ్‌లో అడుగుపెట్టడమే తెలివైన పని. ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే మీ ఆరోగ్యం, డబ్బు రెండూ భద్రంగా ఉంటాయి!

The post కొత్తగా జిమ్‌లో జాయిన్ అవుతున్నారా..? ముందుగా ఈ చిన్న టెస్ట్ చేసుకోండి! appeared first on Manalokam – Latest Telugu News & Updates.