Reading Time: 2 minutes

13 జట్లు, 163 మ్యాచ్‌లు: అక్టోబర్ 10 నుంచి ఫుట్‌బాల్ ధమాకా.. ISL 2026-27 షెడ్యూల్ ఇదే!

Caption of Image.

ISL 2026-27 Schedule: భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ సూపర్ లీగ్ (ISL) 2026-27 సీజన్ ప్రారంభ తేదీలు అధికారికంగా ఖరారయ్యాయి. ఈ కొత్త సీజన్ అక్టోబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమై మే 2027 వరకు సుదీర్ఘంగా 8 నెలల పాటు కొనసాగనుంది. సాంప్రదాయక హోమ్ అండ్ అవే (Home-and-Away) ఫార్మాట్‌లో మొత్తం 13 జట్లు 163 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే జట్టు షీల్డ్ విన్నర్స్ (Shield Winners) గా నిలిచి అధికారిక ఐఎస్‌ఎల్ ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా, ఆసియా ఖండస్థాయి టోర్నీల్లో (Asian Competition) ఆడే అర్హత సాధిస్తుంది. అలాగే పాయింట్ల పట్టికలో టాప్-6లో నిలిచిన జట్లు ఐఎస్‌ఎల్ కప్ కైవసం చేసుకునేందుకు ప్లేఆఫ్స్ ఆడనున్నాయి.

క్లబ్-లెడ్ మోడల్ విధానం: 

ఈసారి ఐఎస్‌ఎల్ సరికొత్త ‘క్లబ్-లెడ్ మోడల్’ (Club-Led Model) విధానంలో నిర్వహించబడుతోంది. దీని ప్రకారం లీగ్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు, వ్యూహాత్మక దిశానిర్దేశాలు నేరుగా ఆయా ఫుట్‌బాల్ క్లబ్‌ల చేతిలోనే ఉంటాయి. భారతీయ ఫుట్‌బాల్ ప్రతిభను ప్రోత్సహించడం, పటిష్టమైన క్యాలెండర్‌ను రూపొందించడం, పెట్టుబడులను పెంచడం ద్వారా దేశంలో ఫుట్‌బాల్ క్రీడకు స్థిరమైన భవిష్యత్తును అందించడమే ఈ నూతన విధానం ప్రధాన లక్ష్యం.

ఐఎఫ్‌ఎల్ విజేతపై క్రమశిక్షణా వేటు: 

2025-26 ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ (IFL) టైటిల్ గెలుచుకుని ఐఎస్‌ఎల్‌కు ప్రమోషన్ సాధించిన డైమండ్ హార్బర్ ఎఫ్‌సీకి ఊహించని షాక్ తగిలింది. రూల్స్ ప్రకారం చెల్లించాల్సిన పరిపాలనా రుసుము (Administrative Fee) ను గడువులోగా చెల్లించడంలో విఫలమవడంతో ఆ జట్టుపై నిర్వహణ మండలి చర్యలు తీసుకుంది. ప్రమోషన్ అండ్ రెలిగేషన్ నిబంధనల ప్రకారం ఈ సీజన్‌లో డైమండ్ హార్బర్ ఎఫ్‌సీకి ఎలాంటి పాయింట్లు కేటాయించలేదు. పాయింట్ల పట్టికలో ఆటోమేటిక్‌గా చివరి స్థానంలో నిలవనున్న ఈ జట్టు, 2027-28 సీజన్‌కు ఐఎస్‌ఎల్ హోదాను కోల్పోయి తిరిగి ఐఎఫ్ఎల్‌కే పరిమితం కానుంది.

ALSO READ : భారత్ vs పాకిస్తాన్ మధ్య హై-వోల్టేజ్ ఫైట్

రంగంలోకి 13 జట్లు: 

* ఈ రాబోయే ఐఎస్‌ఎల్ 2026-27 పోరులో పాల్గొనే 13 జట్ల వివరాలు ఇవే:

* బెంగళూరు ఎఫ్‌సీ, చెన్నైయిన్ ఎఫ్‌సీ, ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ, ఎఫ్‌సీ గోవా, ఇంటర్ కాశీ ఎఫ్‌సీ

* కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ, మోహన్ బగాన్ సూపర్ జెయింట్, ముంబై సిటీ ఎఫ్‌సీ, నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ

* ఒడిశా ఎఫ్‌సీ, పంజాబ్ ఎఫ్‌సీ, స్పోర్టింగ్ క్లబ్ ఢిల్లీ, చర్చిల్ బ్రదర్స్ ఎఫ్‌సీ  

ఈ టోర్నీలో పాల్గొంటున్న చర్చిల్ బ్రదర్స్ ఎఫ్‌సీ క్లబ్ భాగస్వామ్యం మాత్రం అధికారిక రెగ్యులేటరీ ఆమోదాలకు (Regulatory Approvals) లోబడి ఉండనుండటం గమనార్హం. భారీ మార్పులతో ప్రారంభమవుతున్న ఈ 8 నెలల సుదీర్ఘ ఫుట్‌బాల్ పండుగ అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.  

 

©️ VIL Media Pvt Ltd.