Reading Time: < 1 minute

స్మార్ట్ రేషన్ కార్డులపై ఒక ఊరి పేరు బదులు మరో ఊరి పేరు.. గందరగోళంపై లబ్దిదారుల గరంగరం

Caption of Image.

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల గందరగోళం నెలకొంది. స్మార్ట్ రేషన్ కార్డుల్లో ఊర్ల పేరు తారుమారు కావడంతో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సుమారు 3 వేల రేషన్ కార్డులు తప్పుల తడకగా ఉన్నాయి.

మాచారెడ్డి,రామారెడ్డి పల్వంచ మండలాలలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులలో ఓ ఊరు పేరుకు బదులుగా మరో ఊరు పేరు ఉండటమే ఇందుకు కారణం. ఇస్రోజివాడి గ్రామంలో 501 కుటుంబాల గాను 499 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి.

గ్రామంలోని పంపిణీ చేసిన అన్ని రేషన్ కార్డులో ఇస్రోజివాడి గ్రామం పేరు బదులు ఉగ్రవాయి గ్రామంగా ప్రింట్ అయి ఉంది. పిన్ కోడ్ నెంబర్ 503144కు బదులు 503111 గా ప్రింటింగ్ అయింది. చిన్న మల్లారెడ్డి గ్రామంలో 400 రేషన్ కార్డులపై చిన్న మల్లారెడ్డి గ్రామంకు బదులు చిన్న చేగురు గ్రామంగా ప్రింటింగ్ అయింది. రామారెడ్డి మండలంలో అన్నారం గ్రామంకు బదులు మద్దికుంట గ్రామంగా 605 కార్డులు ప్రింటింగ్ అయింది.

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామంకు బదులు రామ్ రెడ్డి పల్లిగా 400 రేషన్ కార్డులపై ప్రింటింగ్ అవడంతో గ్రామస్తులు విస్తుపోయారు. పల్వంచ మండలంలోని పోతారం, బండ రామేశ్వర్ పల్లి గ్రామాలలో గ్రామాల పేరుకు బదులు పల్వంచ గ్రామంగా ప్రింటింగ్ అయింది. ఊరు పేర్లు తారుమారు కావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

ఆధార్ కార్డుపై ఓ ఊరి పేరు, రేషన్ కార్డుపై మరో ఊరు పేరు ఉండటంతో భవిష్యత్తులో సంక్షేమ పథకాలు అందవేమోనని భయాందోళన వ్యక్తం చేశారు. సుమారుగా 3 వేల రేషన్ కార్డుల విషయంలో తప్పులు జరిగినట్లుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు.

©️ VIL Media Pvt Ltd.