Reading Time: 2 minutes
Shah Rukh Khan Spent 6 Lakh Above On Rare Mughal E Azam Posters Says Film Archivist

Shah Rukh Khan: సినిమాలపై షారుఖ్ ఖాన్‌కు ఉన్న ప్రేమ మరోసారి స్పష్టమైంది. వెండితెరపై ఎన్నో విజయాలు అందుకున్న ఈ బాలీవుడ్ బాద్‌షా, భారతీయ సినీ చరిత్రకు చెందిన అరుదైన జ్ఞాపకాలను సంరక్షించడానికీ అంతే ప్రాధాన్యం ఇస్తారని తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆసక్తికర విషయం చెబుతోంది. ఒకప్పుడు ఆయన 1960లో విడుదలైన చిరస్మరణీయ చిత్రం ‘మొఘల్-ఎ-ఆజమ్’కు చెందిన రెండు అసలైన అరుదైన పోస్టర్లను సొంతం చేసుకోవడానికి రూ.6.84 లక్షలు వెచ్చించినట్లు వెల్లడైంది. ఈ విషయం ఇప్పుడు సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఆసక్తికర వివరాలను ప్రముఖ ఫిల్మ్ ఆర్కైవిస్ట్, రచయిత ఎస్.ఎం.ఎం. ఔసజా ఇటీవల ‘ది పూజా భట్ షో’లో వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, షారుఖ్ ఖాన్ కేవలం రెండు పోస్టర్లతోనే ఆగిపోలేదు. అదే వేలంలో దాదాపు 12 నుంచి 13 అరుదైన సినిమా జ్ఞాపికలను కూడా కొనుగోలు చేశారని తెలిపారు. బాలీవుడ్ చరిత్రకు సంబంధించిన విలువైన వస్తువులు కనిపిస్తే వాటిని భద్రపరచడంలో షారుఖ్ ఎప్పుడూ వెనుకాడరని ఆయన తన మనసులో మాటను పంచుకున్నారు.

ఈ వేలం బ్యాంకాక్‌లో నిర్వహించబడిందని, అందులో నటుడు అనిల్ కపూర్ కూడా పాల్గొన్నారని ఔసజా వెల్లడించారు. అయితే అనిల్ కపూర్ ఆసక్తి వెనుక మరో కారణం కూడా ఉంది. ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత సురీందర్ కపూర్, ‘మొఘల్-ఎ-ఆజమ్’ చిత్ర నిర్మాణ సమయంలో సహాయకుడిగా పనిచేశారని సమాచారం. అందువల్ల ఆ మూవీకి సంబంధించిన పోస్టర్లు, ఇతర జ్ఞాపికలు అనిల్ కపూర్‌కు కేవలం సేకరించే వస్తువులు కాకుండా ఫ్యామిలీ గుర్తులుగా కూడా నిలిచాయని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఆయన ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ పేర్లను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఫరా ఖాన్ తన తండ్రి, చిత్రనిర్మాత కామ్రాన్ ఖాన్కు సంబంధించిన అరుదైన పోస్టర్లను సేకరించి భద్రపరిచారని, మరోవైపు రితేష్ దేశ్‌ముఖ్ వద్ద కూడా పాతకాలపు సినిమా పోస్టర్లతో కూడిన విశేషమైన ఆర్కైవ్ ఉందని చెప్పారు.

భారతీయ సినీ చరిత్రకు చెందిన ఎన్నో విలువైన కళాఖండాలు కాలగర్భంలో కలిసిపోతున్న సమయంలో, షారుఖ్ ఖాన్ చేసిన ఈ కొనుగోలు కేవలం ఒక ఖరీదైన హాబీగా చూడలేమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒక సూపర్‌స్టార్‌గా ఆయన వెండితెరపై చరిత్ర సృష్టించడమే కాదు, ఆ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు కూడా తనవంతు కృషి చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఈ అరుదైన పోస్టర్ల కొనుగోలు ఇప్పుడు మరోసారి షారుఖ్‌కు సినీ చరిత్రపై ఉన్న గౌరవాన్ని చాటిచెప్పే ఉదాహరణగా నిలిచింది.