Reading Time: < 1 minute
Bihar Govt To Withdraw Firs Against Neet Protesters Release Detained Students

Bihar: నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై బీహార్‌లో జరిగిన విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, ప్రజలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వందలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలకు ఊరట కలిగించింది.

నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు పలువురిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉదార వైఖరితో ముందుకు రావాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, 2026 జూలై 26 సాయంత్రం 6 గంటల వరకు జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిపై ఎలాంటి శిక్షాత్మక లేదా ప్రతీకార చర్యలు తీసుకోరు. అదే గడువులోపు నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లు, ఫిర్యాదులు, షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకునేందుకు తక్షణమే చట్టపరమైన ప్రక్రియ ప్రారంభించనున్నారు.

అలాగే, నిర్ణీత గడువులోపు నమోదైన కేసుల కింద అరెస్టు చేసిన లేదా నిర్బంధంలో ఉన్న విద్యార్థులు, నిరసనకారులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేసుల ఆధారంగా భవిష్యత్తులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి చర్యలు కూడా తీసుకోబోమని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రభుత్వం కేసులను పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జూలై 27 అర్ధరాత్రి వరకు గడువు ఇస్తూ, అప్పటికీ చర్యలు తీసుకోకపోతే జూలై 29 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వానికి అధికారిక లేఖ కూడా పంపినట్లు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో తేజస్వి ఇలా రాశారు, “నిరసన చేస్తున్న విద్యార్థులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవడానికి ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు అల్టిమేటం. లేకపోతే, జూలై 29వ తేదీ ఉదయం 7 గంటలకు ఆందోళన ప్రారంభమవుతుంది. ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో నడిచే అహంకారి అయిన ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ అధికారిక లేఖ కూడా పంపబడింది.”