Reading Time: < 1 minute
Ap Govt Announces %e2%82%b920 Per Kg Compensation For Tobacco Farmers Centre Joins Price Support

Tobacco Farmers: పొగాకు రైతుల సమస్యలు, ధరల స్థిరీకరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. పొగాకు కొనుగోళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మద్దతు ఇవ్వడానికి అంగీకరించాయి. ఇందుకోసం ఉమ్మడిగా రూ.188 కోట్లను భరించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. అలాగే ధరల లోటు భర్తీ కింద ప్రతి కిలో పొగాకుకు రైతులకు రూ.20 చెల్లించాలని నిర్ణయించారు.

మొత్తం 94 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లకు మద్దతు అందించేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అలాగే బ్రైట్ రకం పొగాకు ధర కిలోకు రూ.240, మీడియం రకం రూ.190, లో గ్రేడ్ పొగాకు రూ.110 కంటే తగ్గకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. పొగాకు రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు సీఎం తెలిపారు. రెండు రోజుల క్రితం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, డైరెక్టర్‌ను కలిసి రైతుల సమస్యలను వివరించినట్లు చెప్పారు. సీఎం సూచనల మేరకు కేంద్ర ప్రతినిధులు రాష్ట్రంలోని పొగాకు బయ్యర్లతో సమావేశమై రైతులకు మేలు చేసే ప్రతిపాదనలపై చర్చించి తుది నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు.. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, టొబాకో బోర్డు ప్రతినిధులు పాల్గొని అమలు చర్యలపై చర్చించారు.