టీటీడీ జూనియర్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు.. పూర్తి వివరాలు ఇవే !

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలల్లో 2026–27 అకాడెమిక్ ఇయర్ కు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు జూలై 23, 24 తేదీల్లో మెరిట్ ఆధారంగా ఆఫ్‌లైన్ విధానంలో స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటన వెలువరించింది.
స్పాట్ అడ్మిషన్లకు టీటీడీ ఉద్యోగుల పిల్లలు, టీటీడీ ఎస్‌వీ బాలమందిర్ విద్యార్థులు, మొదటి నుంచి ఆరో దశ కౌన్సెలింగ్ వరకు హాజరు కాలేకపోయిన అభ్యర్థులు, తిరుపతి స్థానికులు, స్థానికేతర అభ్యర్థులు అర్హులు.
కౌన్సెలింగ్ షెడ్యూల్:
జూలై 23
ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు: 550–600 మార్కులు సాధించిన అభ్యర్థులు
మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు: 500–549 మార్కులు సాధించిన అభ్యర్థులు
జూలై 24
ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు: 450–499 మార్కులు సాధించిన అభ్యర్థులు
మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు: 400–449 మార్కులు సాధించిన అభ్యర్థులు
అర్హులైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో సంబంధిత కళాశాలలకు హాజరై స్పాట్ అడ్మిషన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.
ఆన్‌లైన్‌లో అప్లై చేయని అభ్యర్థులకు ప్రవేశానికి అవకాశం ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.