July 13, 2026

Sam Neill: ‘జురాసిక్ పార్క్’ యాక్టర్ కన్నుమూత.. ఒకే ఒక్క క్యారెక్టర్‌తో గ్లోబల్ ఫేమ్.. సామ్ నీల్ ఎలా చనిపోయారంటే?

Sam Neill: ‘జురాసిక్ పార్క్’ యాక్టర్ కన్నుమూత.. ఒకే ఒక్క క్యారెక్టర్‌తో గ్లోబల్ ఫేమ్.. సామ్ నీల్ ఎలా చనిపోయారంటే?
Reading Time: 2 minutes

Sam Neill: ‘జురాసిక్ పార్క్’ యాక్టర్ కన్నుమూత.. ఒకే ఒక్క క్యారెక్టర్‌తో గ్లోబల్ ఫేమ్.. సామ్ నీల్ ఎలా చనిపోయారంటే?

Caption of Image.

1993లో విడుదలైన క్లాసిక్ మూవీ ‘జురాసిక్ పార్క్’(Jurassic Park) సిరీస్‌లో నటించిన స్టార్ యాక్టర్ సర్ సామ్ నీల్ (Sir Sam Neill) కన్నుమూశారు. ఈ సిరీస్లో డాక్టర్ అలన్ గ్రాంట్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన, ఈ న్యూజిలాండ్ యాక్టర్ సినీ ఆడియన్స్కు ఎంతో సుపరిచితం. ఇవాళ ఉదయం (జూలై 13, 2026న) ఈ 78 ఏళ్ల నటుడు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మరణించినట్లు కుటుంబం సభ్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

2023లో సామ్ నీల్ తనకు అరుదైన రక్త క్యాన్సర్ ఉన్నట్లు ప్రకటించినప్పటికీ, చికిత్స తీసుకున్న తర్వాత ఆయన క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, మరణించే సమయానికి క్యాన్సర్ రహితంగా ఉన్నారని కుటుంబం తెలిపింది. కుటుంబం విడుదల చేసిన ప్రకటనలో, “జూలై 13న సిడ్నీ, ఆస్ట్రేలియాలో సామ్ నీల్ కన్నుమూశారనే విషయాన్ని ఎంతో బాధతో తెలియజేస్తున్నాం. ఆయన తన కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు” అని పేర్కొన్నారు. అలాగే ఆయనకు చికిత్స అందించిన సెయింట్ విన్సెంట్ ప్రైవేట్ హాస్పిటల్ వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

సామ్ నీల్ సినీ ప్రస్థానం:

సామ్ నీల్ అసలు పేరు నిగెల్ జాన్ డెర్మట్ నీల్. 1947 సెప్టెంబర్ 14న ఉత్తర ఐర్లాండ్‌లోని ఓమాగ్‌లో జన్మించారు. 1954లో కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లారు. పాఠశాల రోజుల్లో “నిగెల్” అనే పేరు కంటే “సామ్” అనే పేరు సులభంగా ఉంటుందని భావించి దానిని స్వీకరించారు. మొదట క్రైస్ట్‌చర్చ్‌లో న్యాయశాస్త్రం చదివిన ఆయన, తర్వాత నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. కాంటర్‌బరీ యూనివర్సిటీ నాటకాలతో నటనా ప్రస్థానం ప్రారంభించి, వెల్లింగ్టన్‌లోని డౌన్‌స్టేజ్ థియేటర్‌లో ప్రొఫెషనల్ నటుడిగా మారారు.

50 ఏళ్లకు పైగా సాగిన కెరీర్..

1977లో వచ్చిన ‘స్లీపింగ్ డాగ్స్’ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘మై బ్రిలియంట్ కెరీర్’, ‘ది ఓమెన్ III: ది ఫైనల్ కాన్ఫ్లిక్ట్’, ‘పొజెషన్’, ‘ఎవిల్ ఏంజెల్స్’, ‘ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్’ వంటి చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు. అలాగే, టెలివిజన్‌లో కూడా ఆయన ‘పీకీ బ్లైండర్స్’, ‘ది ట్యూడర్స్’, ‘ది ట్వెల్వ్’, ‘ది సింప్సన్స్’, ‘రిక్ అండ్ మార్టీ’ వంటి సిరీస్‌లలో నటించారు. సామ్ నీల్ నటనకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు నామినేషన్ కూడా అందుకున్నారు. ఇలా సామ్ నీల్.. తన 78 ఏళ్ళ జీవితంలో దాదాపు 50 ఏళ్లకు పైగా సినిమాలతోనే జీవించాడు. తన మొత్తం కెరీర్లో 150కి పైగా సినిమాలు, టీవీ ప్రాజెక్టుల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు.

ముఖ్యంగా 1993లో విడుదలైన ‘జురాసిక్ పార్క్’ సినిమాతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో స్టార్‌గా ఎదిగారు. ఇందులో ప్యాలియోంటాలజిస్ట్ డాక్టర్ అలన్ గ్రాంట్ పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ‘జురాసిక్ పార్క్ III’తో పాటు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్లోనూ అదే పాత్రలో కనిపించి మెప్పించారు. సామ్ నీల్ మృతి పట్ల సినీ ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.