July 13, 2026

Hair Care Tips: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇది నిజమా లేక అపోహా?

Hair Care Tips: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇది నిజమా లేక అపోహా?
Reading Time: 2 minutes
Does Shaving Your Head Make Hair Grow Thicker Doctors Reveal The Truth

Hair Care Tips: చిన్నప్పటి నుంచి మనలో చాలా మంది ఒక మాట వింటూనే పెరిగారు. అదేమిటంటే ఒకసారి గుండు చేయించుకుంటే జుట్టు మరింత ఒత్తుగా, బలంగా పెరుగుతుందని. అందుకు తగ్గట్లే పెద్దలు కూడా కొంతమంది పిల్లలకు చిన్న వయసులోనే గుండు చేయిస్తుంటారు. పెద్దయ్యాక కూడా జుట్టు పలచబడుతోందని భావించిన చాలామంది ఇదే నమ్మకంతో తల గుండు చేయించుకుంటారు. కానీ నిజంగా గుండు చేయించుకోవడం వల్ల జుట్టు మందంగా పెరుగుతుందా? లేక ఇది తరతరాలుగా వస్తున్న ఒక అపోహ మాత్రమేనా? ఈ ప్రశ్నకు వైద్య నిపుణులు స్పష్టమైన సమాధానం ఇస్తున్నారు.

జుట్టును పూర్తిగా షేవ్ చేయడం, తరచూ కత్తిరించడం వల్ల అది మరింత ఒత్తుగా పెరుగుతుందనే విషయానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. జుట్టు షేవ్ చేసిన కొద్ది రోజుల తర్వాత కొత్తగా మొలిచిన వెంట్రుకలు గరుకుగా, మందంగా కనిపించడం వల్ల చాలామందికి అది నిజంగానే ఒత్తుగా పెరిగిందనే భావన కలుగుతుంది. అయితే ఇది కేవలం కళ్లకు కనిపించే ఒక భ్రమ మాత్రమేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

నిజానికి పెరిగిన జుట్టు చివరలు సన్నగా, మృదువుగా ఉంటాయి. కానీ రేజర్‌తో షేవ్ చేసినప్పుడు వెంట్రుక చివర భాగం చదునుగా కత్తిరించబడుతుంది. అందువల్ల కొత్తగా బయటకు వచ్చే వెంట్రుకల చివరలు మందంగా, గట్టిగా అనిపిస్తాయి. వాటిని తాకినప్పుడు కూడా అవి మునుపటి కంటే గరుకుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్లే జుట్టు ఒత్తుగా పెరిగిందనే అపోహ బలపడుతోంది.

జుట్టు పెరుగుదల చర్మం లోపల ఉండే కేశ కుదుళ్ల నుంచి ప్రారంభమవుతుంది. షేవింగ్ చేసే సమయంలో రేజర్ కేవలం చర్మం బయట కనిపించే జుట్టును మాత్రమే తొలగిస్తుంది. జుట్టు పెరుగుదలను నియంత్రించే కేశ కుదుళ్ల వరకు అది చేరదు. అందువల్ల షేవింగ్ వల్ల జుట్టు మందం, పెరుగుదల వేగం, నాణ్యతలో ఎలాంటి మార్పు ఉండదు. ఒక వ్యక్తి జుట్టు ఎలా ఉంటుందనేది ప్రధానంగా జన్యువులు, హార్మోన్ల సమతుల్యత, పోషకాహారం, లైఫ్ స్టైల్ , ఒత్తిడి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

కొత్తగా పెరిగే జుట్టు కొన్నిసార్లు మరింత నల్లగా కూడా కనిపిస్తుంది. దీనికి కూడా ఒక శాస్త్రీయ కారణమే ఉంది. చాలా కాలంగా ఉన్న జుట్టు సూర్యరశ్మి, కాలుష్యం, దుమ్ము, షాంపూలు, ఇతర హెయిర్ ప్రొడక్ట్స్ ప్రభావంతో కొద్దిగా రంగు కోల్పోతుంది. కానీ కొత్తగా మొలిచిన జుట్టు ఇంకా ఈ ప్రభావాలకు గురికాకపోవడంతో సహజమైన ముదురు రంగులో కనిపిస్తుంది. దీంతో జుట్టు మరింత దట్టంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.

చర్మవ్యాధి నిపుణులు కూడా జుట్టు రాలిపోతుంటే, గుండు చేయించుకోవడం పరిష్కారం కాదని చెబుతున్నారు. పైగా సరిగ్గా షేవ్ చేయకపోతే తల చర్మంపై గాయాలు, చికాకు, ఇన్‌గ్రోన్ హెయిర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందట. అందువల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్, ఐరన్, బయోటిన్ వంటి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, అవసరమైతే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం ఉత్తమ మార్గం.

అందుకే గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందనే నమ్మకం శాస్త్రీయంగా నిజం కాదు. అది కేవలం జుట్టు తిరిగి పెరిగే విధానం వల్ల కలిగే దృశ్య భ్రమ మాత్రమే. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సరైన జీవనశైలి, సమతుల ఆహారం, అవసరమైన వైద్య సలహాలే నిజమైన పరిష్కారమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.