Nag Ashwin: నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు… ‘కల్కి’పై విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్

Nag Ashwin: సోషల్ మీడియాలో ఎక్కువగా స్పందించని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పుడు తన మౌనాన్ని వీడారు. ‘కల్కి 2898 AD’ చిత్రంలో కర్ణుడి పాత్రను చూపించిన తీరు, క్లైమాక్స్‌పై వస్తున్న విమర్శలకు ఆయన స్వయంగా స్పందించారు. అంతేకాదు ‘పార్ట్ 2 కోసం వేచి ఉండండి’ అంటూ ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ వివాదానికి కారణం అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ సినిమా విడుదల తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్ట్. ఆ చిత్రంలో ప్రమోద్ పంజు నటనను ప్రశంసించిన ఓ నెటిజన్, కర్ణుడిని వెండితెరపై ఇలాగే చూపించాలంటూ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో ‘కల్కి 2898 AD’లో కర్ణుడి పాత్రను నాగ్ అశ్విన్ అతిగా కీర్తించారని ఆరోపిస్తూ, సినిమా క్లైమాక్స్‌ను దైవదూషణగా అభివర్ణించాడు. దీంతో ఈ అంశంపై అభిమానులు, విమర్శకుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
ఈ ఆరోపణలను వదిలేయకుండా, నాగ్ అశ్విన్ స్వయంగా స్పందించడం విశేషంగా మారింది. మహాభారతంలోని ఆధారాలను చూపిస్తూ ఆయన తన మేకింగ్ ను సమర్థించుకున్నారు. ద్రోణ వధ పర్వానికి చెందిన ఒక పేజీని షేర్ చేస్తూ, అర్జునుడితో శ్రీకృష్ణుడు స్వయంగా కర్ణుడి గొప్పతనాన్ని ప్రస్తావించిన సందర్భాలను గుర్తు చేశారు. మహాభారతాన్ని పూర్తిగా చదవాలని, లేదంటే కనీసం శ్రీకృష్ణుడు కర్ణుడిని ఎన్నిసార్లు ప్రశంసించాడో పరిశీలించాలని సూచించారు. అంతేకాదు, భారతీయ ఇతిహాసాలపై తనకు అపారమైన గౌరవం ఉందని, వాటిని అవగాహన చేసుకుని మాత్రమే సినిమా రూపొందించానని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. తాను ఏం చేస్తున్నానో తనకు పూర్తిగా తెలుసని చెప్పిన ఆయన, చివర్లో ‘పార్ట్ 2 కోసం వేచి ఉండండి’ అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతోంది. దీంతో ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో కర్ణుడి పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండబోతుందా? అనే చర్చ కూడా మొదలైంది.
నాగ్ అశ్విన్ చేసిన ఈ పోస్ట్ తో సోషల్ మీడియాలో మరోసారి మహాభారతంలోని కర్ణుడి పాత్రపై చర్చలు ఊపందుకున్నాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ‘కల్కి 2898 AD పార్ట్ 2’పై ఇప్పటికే ఉన్న అంచనాలు ఈ ఒక్క స్పందనతో మరింత పెరిగాయి. కర్ణుడి పాత్రను నాగ్ అశ్విన్ తదుపరి భాగంలో ఎలా చూపిస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో మరింత పెరిగింది.
#NagAshwin breaks his silence on the criticism surrounding Karna’s portrayal in #Kalki2898AD.
“I know what I’m doing. Wait for Part 2.”#Prabhas | #KamalHaasan pic.twitter.com/aWgSwyBZyN
— Movies4u Official (@Movies4u_Officl) July 13, 2026