July 13, 2026

Watch: ఆరేళ్ల మనవరాలితో రద్దీ రోడ్డుపై కారు డ్రైవింగ్‌ చేయించిన SI తాత.. కేసు నమోదు

Watch: ఆరేళ్ల మనవరాలితో రద్దీ రోడ్డుపై కారు డ్రైవింగ్‌ చేయించిన SI తాత.. కేసు నమోదు
Reading Time: < 1 minute
Watch: ఆరేళ్ల మనవరాలితో రద్దీ రోడ్డుపై కారు డ్రైవింగ్‌ చేయించిన SI తాత.. కేసు నమోదు

హైదరాబాద్‌, జులై 13: మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని అవగాహన కల్పించే పోలీసు శాఖకే చెందిన ఓ ఎస్సై తన ఆరున్నరేళ్ల మనవరాలికి రోడ్డుపై కారు డ్రైవింగ్‌ నేర్పించేందుకు ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నార్సింగి పోలీసుస్టేషన్‌ పరిధిలోని గంధంగూడలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై పూజారి తిరుపతి తన కారు (టీఎస్‌07 జీపీ 7450)ను మనవరాలికి ఇచ్చి గంధంగూడ రోడ్డుపై డ్రైవింగ్‌ నేర్పిస్తున్నారు. ఆ సమయంలో రద్దీగా ఉండే రహదారిపై చిన్నారి వాహనం నడుపుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అడ్డుకుని, ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఎస్సై, కారు ఆటోమేటిక్‌ వాహనమని, నియంత్రణ తన చేతిలోనే ఉంటుందని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే అక్కడే ఉన్న బాలిక తన తాత ఎస్సై అని చెప్పడంతో ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.

 

ఈ క్రమంలో కొంతసేపు రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానికుల్లో కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ప్రచారం చేసే పోలీసులే నిబంధనలను ఉల్లంఘించడం సరికాదని విమర్శిస్తున్నారు. ఘటనపై స్పందించిన నార్సింగి పోలీసులు, సంబంధిత ఎస్సైపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వైరల్‌ వీడియో ఆధారంగా విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.