తెలంగాణలో వరెస్ట్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.. ఆయనవన్నీ చిల్లర పాలిటిక్స్: MP అర్వింద్

హైదరాబాద్: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌పై ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు గుప్పించారు. ఆదివారం (జులై 12) జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్వి చిల్లర రాజకీయాలని విమర్శించారు. తెలంగాణలో వరెస్ట్ ఎమ్మెల్యే సంజయేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల తరపున మాట్లాడుతారని.. ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాడు కాదన్నారు. సీనియర్ నేత జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకోవడం తప్పిదమని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక, బీజేపీ పోరాటానికి తలొగ్గే రాష్ట్ర ప్రభుత్వం చల్గల్‌లో కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల భూమి కేటాయించిందని అన్నారు.
కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాలు సరిపోవని.. మరో 5 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదనపు భూమి కేటాయించకపోతే ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్‌ని అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. విద్యాశాఖ, పరిపాలనపై సీఎం రేవంత్‌కు అవగాహన లేదని.. రేవంత్ రెడ్డికి ఆయన గురువు చంద్రబాబు ABCలు నేర్పించాలని ఎద్దేవా చేశారు.