July 12, 2026

KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?

KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
Reading Time: < 1 minute
Ktr Fire On Congress Over Irrigation Water

KTR : రాష్ట్రంలో ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీరు అందించాలంటూ డిమాండ్ చేసిన ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా అత్యంత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా.. రక్త పిశాచీ! ఇంకా తీరలేదా మీ రక్తదాహం?” అంటూ కాంగ్రెస్ పాలనను ఆయన కడిగిపారేశారు. గత 60 ఏళ్లుగా తెలంగాణను పీడించి, ఇక్కడి బిడ్డల రక్తాన్ని తాగిన కాంగ్రెస్ తోడేలుకు ఇంకా ఎంత రక్తం కావాలని నిలదీశారు. తెలంగాణ పిల్లలను పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి, ఎన్‌కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతక చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు. 1952లో ఏడుగురు యువకులను, 1969లో 369 మంది ముద్దుబిడ్డలను తూటాలతో బలితీసుకున్న ఖూనీకోర్లు మీరేనని, మలిదశ పోరాటంలోనూ వేయిమంది బలిదానాలకు కాంగ్రెస్ మృగాలే కారణమని, ఆ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిసిపోయాయని కేటీఆర్ ధ్వజమెత్తారు.

 

కాంగ్రెస్ రక్కసి కోరలకు అంటిన తెలంగాణ నెత్తుటి మరకలు ఎప్పటికీ చెరిగిపోవని, రైతుల కోసం తాము ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. పేగులు తెగేదాకా రాష్ట్రం కోసం కొట్లాడి, నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన చరిత్ర తమదని గుర్తుచేశారు. “నెత్తురు ఇస్తేనే.. నీళ్లు ఇస్తాం అని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తాం.. మీ రక్తదాహం తీర్చుకోని, ఎండిపోతున్న పొలాల జలదాహం తీర్చండి” అంటూ రైతుల పక్షాన నిలబడి ఎంతటి త్యాగానికైనా తాము వెనకాడబోమని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.