రోస్టర్ విధానంతోనే మాలలకు అన్యాయం: మంత్రి వివేక్ వెంకస్వామి

రోస్టర్ విధానం పేరుతో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. భద్రాచలం పర్యటనలో భాగంగా మాట్లాడిన ఆయన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం కొన్ని సెక్టార్లను మాత్రమే లెక్కించి, ఆనాటి పాత దామాషా ప్రకారం విభజన చేయడం ముమ్మాటికీ అన్యాయం జరుగుతుంది.. ఇదే విషయాన్ని షమీమ్ అఖ్తర్ నివేదిక కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పిందన్నారు.
రాజ్యాంగం ప్రకారం మనకు దక్కాల్సిన 5 శాతం వాటా ఎక్కడ? ప్రస్తుత గ్రూపుల విభజన వల్ల కేవలం రెండున్నర నుండి మూడు శాతం మాత్రమే వాటా మిగిలే ప్రమాదం ఉంది. ఈ అన్యాయంపై నేను ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను. క్యాబినెట్ సబ్ కమిటీలోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. నేను ఒకటే స్పష్టం చేస్తున్నా.. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకపోతే.. మన హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమించక తప్పదు
మా సమాజానికి నాదొక్కటే భరోసా.. మన జాతికి అన్యాయం జరిగితే మాకు ఈ పదవులు, అధికారాలు అస్సలు ముఖ్యం కాదు! కానీ, ఈ పోరాటంలో మనమంతా కలిసికట్టుగా ఉండాలి. చిన్న చిన్న గ్రూపులుగా విడిపోతే మనం బలహీనపడతాం. ముఖ్యంగా మాల ఉద్యోగస్థులు చొరవ తీసుకుని, ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనాల్సిన సమయం వచ్చింది. మీ సమస్యల వివరాలు నాకు అందించండి.. మీ కోసం నేను ప్రభుత్వంతో మాట్లాడుతా.. ముందుండి కొట్లాడుతా అని వివేక్ అన్నారు.