Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!

Shreyas Iyer Toss Record: టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా వరుసగా అత్యధిక టాస్‌లు గెలిచిన సారథిగా నిలిచాడు. శనివారం రాత్రి ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఐదో టీ20లో టాస్ గెలవడంతో శ్రేయస్ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సర్పంచ్ సాబ్ సమం చేశాడు.
2010 నుంచి 2012 మధ్య ధోనీ భారత కెప్టెన్‌గా వరుసగా ఏడు టీ20 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచాడు. ఇప్పుడు 2026లో శ్రేయస్ అయ్యర్ కూడా వరుసగా ఏడు టాస్‌లు గెలిచి.. ధోనీ సరసన అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ వరుసగా ఆరు టాస్ విజయాలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ధోనీ 2007లో వరుసగా ఐదు టాస్‌లు గెలవగా.. రోహిత్ శర్మ 2020-22 మధ్య ఐదు టాస్ విజయాలు నమోదు చేశాడు.
అయితే ఐదో టీ20లో టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్‌కు మ్యాచ్ ఫలితం మాత్రం నిరాశనే మిగిల్చింది. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ వేదికగా జరిగిన ఈ పోరులో ఇంగ్లండ్ 56 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. సౌతాంప్టన్‌లో ఇటీవల టీ20 ఫలితాలను పరిశీలిస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు విజయాలు అందుకుంది. 2021 నుంచి ఈ వేదికపై జరిగిన ఐదు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. ఆ మ్యాచ్‌ల్లో విజయాల తేడాలు వరుసగా 89, 50, 90, 28, 37 పరుగులుగా నమోదయ్యాయి. తాజాగా భారత్‌పై ఇంగ్లండ్ కూడా 56 పరుగుల తేడాతో గెలవడంతో ఈ ట్రెండ్ మరోసారి కొనసాగింది.
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు ఒక్క విజయం అందుకోలేదు. ఇప్పటివరకు 7 మ్యాచులలో సారథ్యం వహించగా.. ఏకంగా ఆరింటిలో ఓడిపోయింది. ఓ మ్యాచ్ రద్దయింది. టాస్‌ల విషయంలో శ్రేయస్ తన అదృష్టాన్ని కొనసాగిస్తుండగా.. సారథిగా మాత్రం నిరాశపర్చుతున్నాడు. మరో మ్యాచ్‌లోనూ టాస్ గెలిస్తే వరుసగా ఎనిమిది టాస్ విజయాలతో భారత టీ20 కెప్టెన్లలో సరికొత్త రికార్డు సృష్టించే అవకాశం శ్రేయస్‌కు ఉంది.