July 12, 2026

Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్‌ తో అరంగేట్రం!

Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్‌ తో అరంగేట్రం!
Reading Time: 2 minutes
Disha Patani Hollywood Debut Holyguards Saga The Portal Of Force Kevin Spacey Awarapan 2 Update

Disha Patani: బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి దిశా పటాని. గ్లామర్, యాక్షన్, డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరించిన ఆమె, ఇప్పుడు హాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా పడుకోన్, అలీ ఫజల్, అనుపమ్ ఖేర్ వంటి భారతీయ నటులు అంతర్జాతీయ చిత్రాల్లో తమ ప్రతిభను చాటుకోగా, ఇప్పుడు ఆ జాబితాలో దిశా పటాని పేరు కూడా చేరనుంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌తో ఆమె హాలీవుడ్ అరంగేట్రం చేయనున్నట్లు వెల్లడికావడంతో కుర్ర కారు ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు.  దిశా పటాని ఆస్కార్ విజేత కెవిన్ స్పేసీ దర్శకత్వం వహిస్తున్న ‘హాలీగార్డ్స్ సాగా: ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్’ చిత్రంతో హాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. అతీంద్రియ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతీయ నటీమణులు హాలీవుడ్‌లో అవకాశాలు అందుకోవడం కొత్త విషయం కాకపోయినా, దిశాకు మాత్రం ఇది కెరీర్‌లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ గా భావిస్తున్నారు.

తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో దిశా తన హాలీవుడ్ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. హాలీవుడ్‌లో అవకాశాలు పూర్తిగా ఆడిషన్ల ఆధారంగానే ఉంటాయని, అక్కడ ప్రతిభను నిరూపించుకోవడం తప్పనిసరి అని ఆమె తెలిపింది. అదృష్టం కూడా ఒక ముఖ్యమైన అంశమే అయినప్పటికీ, కేవలం పేరు ఉంటే అవకాశాలు రావని, ప్రతి నటుడు తన సామర్థ్యాన్ని ఆడిషన్‌ల ద్వారా చూపించాల్సి ఉంటుందని వివరించింది. అంతేకాదు ఇండియాలో కూర్చుని అంతర్జాతీయ అవకాశాల కోసం ఎదురు చూడటం సరిపోదని, అవసరమైతే అక్కడికి వెళ్లి, అక్కడే ఉండి, నిరంతరం ప్రయత్నాలు చేయాలని ఆమె అభిప్రాయపడింది. ఆన్‌లైన్‌లో ఆడిషన్‌లు ఇవ్వడం సాధ్యమే అయినప్పటికీ, ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయని వెల్లడించింది.

ఇక దిశా కెరీర్ విషయానికి వస్తే, ఇటీవల అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘వెల్కమ్ టు ది జంగిల్’ చిత్రంలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్ట్‌తో పాటు ఆమె హిందీలో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. దిశా తదుపరి హిందీ చిత్రం ‘అవరపన్ 2’. ఇందులో ఆమె ఇమ్రాన్ హష్మీతో కలిసి నటిస్తోంది. ఈ చిత్రం 2026 ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ఒకవైపు బాలీవుడ్, మరోవైపు హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో దిశా పటాని కెరీర్‌ జోరు మీద ఉన్నట్లే కనిపిస్తోంది. అంతర్జాతీయ వేదికపై ఆమె నటనకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి మరి.