Reading Time: 2 minutes
Hardik Pandya Captaincy Under Pressure Kieron Pollards Explosive Remarks After Mis Ipl 2026 Failure

Kieron Pollard About Hardik Pandya Captaincy: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై.. ఈసారి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై కూడా భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్‌గా మాత్రమే కాకుండా.. ఆటగాడిగా కూడా హార్దిక్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కీరన్ పొలార్డ్.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై స్పందించాడు. ‘నాయకత్వ పరంగా చూస్తే హార్దిక్ పాండ్యా కోరుకున్న విధంగా ఈ సీజన్ సాగలేదు. జట్టు యాజమాన్యం ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే అతడికి మేము సాధ్యమైనన్ని అవకాశాలు ఇచ్చాం. ఫ్రాంచైజీని ముందుండి నడిపించేందుకు అన్ని విధాలుగా మద్దతు ఇచ్చాం. అయితే ఈ వైఫల్యానికి ఒక్క హార్దిక్‌ను మాత్రమే బాధ్యుడిని చేయలేము. మేమెవరినీ నిందించం. ఓటమి వచ్చినప్పుడు అది మొత్తం జట్టు వైఫల్యమే. అందరం కలిసి ప్రయత్నించాం కానీ ఈసారి పూర్తిగా వెనకపడిపోయాం. ఇక ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకోవాలి. భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అవసరం’ అని పొలార్డ్ చెప్పుకొచ్చాడు.

ముంబై ఇండియన్స్ వచ్చే సీజన్‌కు ముందు జట్టులో మార్పులు ఉండే అవకాశం ఉందని కూడా కీరన్ పొలార్డ్ సంకేతాలు ఇచ్చాడు. ‘ఇప్పుడు ఎమోషనల్‌గా స్పందించే సమయం కాదు. జట్టుకు ఏం అవసరమో, ఎక్కడ తప్పు జరిగిందో పూర్తిగా అంచనా వేసిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాం. వచ్చే సీజన్‌కు ఇప్పుడే మార్పుల గురించి మాట్లాడటం బాధ్యతారాహిత్యం అవుతుంది’ అని పేర్కొన్నాడు. జస్ప్రీత్ బుమ్రాను రాజస్థాన్ మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వడంపై మాట్లాడుతూ… ‘బుమ్రా భారత క్రికెట్‌కు అమూల్యమైన ఆటగాడు. ఈ మ్యాచ్ గెలిచినా మాకు ప్లేఆఫ్స్ అవకాశం లేదు. అందుకే అతడిని ఆడించకుండా విశ్రాంతి ఇవ్వడం సరైన నిర్ణయంగా భావించాం. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనుకున్నాం’ అని తెలిపాడు.

మొత్తం సీజన్‌ను సమీక్షిస్తూ పొలార్డ్ నిరాశ వ్యక్తం చేశాడు. ‘ఇది పూర్తిగా ఏమైందనే? అనే ప్రశ్నలతో ముగిసిన సీజన్. మేము నిలకడగా విజయాలు సాధించలేకపోయాం. మొమెంటమ్ వచ్చినప్పుడల్లా దాన్ని ఉపయోగించుకోలేకపోయాం. చివరికి మేము ఆడిన క్రికెట్‌కు తగ్గట్టే పాయింట్ల పట్టికలో స్థానం దక్కింది. అన్ని విభాగాల్లో విఫలమైన మాకు తగిన శాస్తి జరిగింది’ అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ముంబై భవిష్యత్తు, హార్దిక్ కెప్టెన్సీ కొనసాగుతుందా లేదా అన్న అంశం ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిగా మారింది.