Reading Time: < 1 minute
Calcutta High Court Fresh Probe Rg Kar Rape Murder Case

RG Kar Case: దేశాన్ని, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 2024లో జరిగిన ఈ దారుణ ఘటనపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సాక్ష్యాలు నాశనం చేశారనే ఆరోపణలు, ఘటన తీవ్రతను తగ్గించి చూపారనే వాదనల నేపథ్యంలో మళ్లీ కొత్త దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించింది.

Read Also: Ebola outbreak: ఎబోలా వైరస్‌పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..

సాక్ష్యాలు తారుమారు చేశారని ఆరోపణలపై పున:దర్యాప్తు చేసేందుకు సీబీఐతో ముగ్గురు సభ్యుల సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 2024 ఆగస్టు 09 తేదీ రాత్రి ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లోపల ఒక యువ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనపై జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్‌లో కూడిన ధర్మాసనం, కొత్తగా విచారణ చేసే సిట్‌కు సీబీఐ జాయింట్ డైరెక్టర్(తూర్పు జోన్) నాయకత్వం వహిస్తారని చెప్పింది. మరో ఇద్దరు సభ్యుల్ని 48 గంటల్లో ఖరారు చేయాలని ఆదేశించింది.

రాత్రి మహిళా వైద్యురాలు భోజనం చేసినప్పటి నుంచి ఆమె అంత్యక్రియలు జరిగే వరకు జరిగిన సంఘటలను పరిశీలించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఈ సంఘటనలో తీవ్రతను తగ్గించడానికి సాక్ష్యాలు నాశనం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు చేసిన ఆరోపణల్ని సిట్ పరిశీలిస్తుందని న్యాయస్థానం చెప్పింది. జూన్ 25న ఈ విషయంపై మళ్లీ విచారిస్తామని వెల్లడించింది. ఈలోగా దర్యాప్తు నివేదికను సమర్పించాలని సిట్‌ను కోరింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం ఈ ఘటనలో ఒకరి కన్నా ఎక్కువ మంది ప్రమేయం ఉందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు.