Reading Time: < 1 minute
దారుణం.. ఆడుకుంటూ లిఫ్ట్‌లోకి వెళ్లిన ఏడేళ్ల బాలుడు..! కాసేపటికే ఘోరం

పూణె, మే 20: పూణేలోని సింహగడ్ రోడ్ ప్రాంతంలో నింబాజీనగర్‌లోని రిద్ధి సిద్ధి అపార్ట్‌మెంట్‌ హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో ఎప్పటిలాగే రాత్రి సుమారు 10 గంటల సమయంలో శివాంశ్ శైలేష్ ధుత్‌ ఆడుకుంటున్నాడు. అనంతరం శివాంగ్‌ అపార్ట్‌మెంట్‌ భవనంలోని లిఫ్ట్‌లోకి ప్రవేశించి, దానిలోని ఒక బటన్‌ను నొక్కగానే.. లిఫ్ట్ కదలడం ప్రారంభించింది. అయితే లిఫ్ట్‌ రెండవ అంతస్తుకు చేరుకోకముందే మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆ బాలుడు లిఫ్ట్‌ లోపల చిక్కుకుపోయాడు. రాత్రి సమయం ఎంతైనా శివాంశ్‌ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. గాలింపులో భాగంగా బాలుడు లిఫ్ట్ ఇరుక్కుపోయి ఉండవచ్చని అనుమానించారు. అయితే అప్పటికే లిఫ్ట్‌ స్టక్‌ అయి ఉన్నట్లు గమనించిన కుటుంబ సభ్యులు రాత్రి సుమారు 11.30 గంటలకు పోలీసులకు, అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు.

అగ్నిమాపక సిబ్బంది, సింహగడ్ రోడ్ పోలీసుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాసేపటి తర్వాత లిఫ్ట్‌ను తెరవగలిగారు. అయితే అప్పటికే అందులో ఉన్న చిన్నారి స్పృహ కోల్పోయాడు. హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడు ఎక్కువసేపు మూసి ఉన్న ప్రదేశంలో చిక్కుకుపోవడం వల్ల మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.

ప్రాథమిక పోలీసు విచారణలో లిఫ్ట్‌లో సాంకేతిక లోపం ఏదీ లేదని తేలింది. లిఫ్ట్‌ నిర్వహణ బాధ్యతలు చూసే హౌసింగ్ సొసైటీ యాజమాన్యం కూడా ఇదే తెలిపింది. దీంతో సింహగడ్ రోడ్ పోలీసులు ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందినట్లు కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.