
సినీ ప్రపంచంలో సరిహద్దులు చెరిగిపోయాయి. కంటెంట్ ఉంటే చాలు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న చిత్రాలైనా హీరోలతో సంబంధం లేకుండా రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇండియన్ సినిమాలు ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి ధీటుగా వస్తున్నాయి. దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’, అదే విధంగా బాలీవుడ్ మూవీ ‘రామాయణం’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ప్రపంచాన్ని జయించేందుకు రెడీ అవుతున్నాయి. సినీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు భారీ ప్రణాళికతో వస్తున్నాయి.
భారీ ఆశలతో..
అటు ఇప్పటికే చైనా ‘నీ జా 2’తో బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరగా, కొరియన్ సినిమాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా కూడా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని, తన దేశపు సినిమా ప్రతిష్టను పెంచేందుకు ‘డెజర్ట్ వారియర్’ (Desert Warrior) అనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేపట్టింది. కానీ, దురదృష్టవశాత్తూ ఈ సినిమా చరిత్రలోనే అతిపెద్ద బాక్సాఫీస్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
అతిపెద్ద బాక్సాఫీస్ డిజాస్టర్‌గా
2021లో సౌదీ మీడియా దిగ్గజం ‘MBC గ్రూప్’ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఏడవ శతాబ్దపు అరేబియా నేపథ్యంలో, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే యువరాణి హింద్ కథగా దీనిని రూపొందించారు. హాలీవుడ్ స్టార్స్, మార్వెల్ కొత్త కెప్టెన్ అమెరికా ఆంథోనీ మాకీ, ఆస్కార్ విజేత బెన్ కింగ్స్లీ వంటి దిగ్గజాలను ప్రధాన పాత్రల కోసం ఎంపిక చేశారు. ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ చిత్ర దర్శకుడు రూపెర్ట్ వ్యాట్ దీనికి దర్శకత్వం వహించడంతో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
భారీ బడ్జెట్ !
సౌదీలోని స్థానిక సినీ రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అంతర్జాతీయ సాంకేతిక నిపుణులను రప్పించారు. దాదాపు 500 మందికి పైగా సిబ్బందితో ప్రతిరోజూ షూటింగ్ నిర్వహించడం, నటీనటుల భారీ పారితోషికాలు , నిర్మాణంలో జరిగిన జాప్యం కారణంగా బడ్జెట్ ఊహించని విధంగా సుమారు రూ.1400 కోట్లు పెరిగింది. రెండేళ్ల సుదీర్ఘమైన పోస్ట్ ప్రొడక్షన్ పనుల తర్వాత, 2025లో జ్యూరిచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శితమైంది. భారీ అంచనాలతో ఏప్రిల్ 2026లో విడుదలైన ఈ మూవీ కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. భారీ బడ్జెట్ సినిమా ఏకంగా 99.6 శాతం నష్టపోయింది. కేవలం రూ. 6 కోట్లు మాత్రమే రాబట్టుకోగలిగింది.
►ALSO READ | అడవిలో సింహం.. పేటలో సేనాపతి రవి.. సందీప్ కిషన్ ‘పవర్ పేట’ గ్లింప్స్ రిలీజ్!
ఘోర పరాజయం
ఏప్రిల్ 2026లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘డెజర్ట్ వారియర్’ విమర్శకుల ప్రశంసలు పొందడంలోనూ, బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించడంలోనూ పూర్తిగా విఫలమైంది. కథనం నెమ్మదిగా ఉండటం, భారీ తారాగణం ఉన్నా సరైన భావోద్వేగాలు పండకపోవడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిరస్కరించారు. ఫలితంగా, సౌదీ అరేబియా కన్న గ్లోబల్ సినిమా కల, చరిత్రలోనే ఒక ‘బిగ్గెస్ట్ బాక్సాఫీస్ డిజాస్టర్’గా మిగిలిపోయింది. కేవలం భారీ బడ్జెట్, హాలీవుడ్ స్టార్స్ ఉన్నంత మాత్రాన విజయం వరించదని ఈ చిత్రం మరోసారి నిరూపించింది.