Reading Time: 2 minutes
High Court: పోలీసులను పిలవండి.. లాయర్‌పై హైకోర్టు జడ్జి ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే..

“పోలీసులను పిలవండి..” ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జి నోట వచ్చిన ఈ మాటలతో ఒక్కసారిగా కోర్టు హాల్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎదురుగా ఉన్న యువ న్యాయవాది చేతులు జోడించి “సారీ.. క్షమించండి” అంటూ వేడుకున్నా.. ధర్మాసనం ఆగ్రహం మాత్రం తగ్గలేదు. జస్టిస్ టర్లాడ రాజశేఖర్ రావు, ఓ యువ లాయర్ మధ్య జరిగిన ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లుక్ అవుట్ నోటీసు, పాస్‌పోర్టు స్వాధీనం కేసు విచారణలో ఈ ఘటన జరిగింది. లుక్ అవుట్ నోటీసు (LOC), పాస్‌పోర్టు స్వాధీనం అంశాలకు సంబంధించిన ఓ పిటిషన్ మంగళవారం హైకోర్టు ముందుకు వచ్చింది. విచారణ సందర్భంగా గతంలో ఇలాంటి కేసులో ఇచ్చిన ఆదేశాల కాపీ అవసరమని కోర్టు భావించింది. దీంతో కేసును వాయిదా వేయాలని జస్టిస్ రాజశేఖర్ రావు సూచించారు.

అయితే, ఈ సమయంలో పిటిషనర్ తరఫు యువ న్యాయవాది వెంటనే విచారణ కొనసాగించాలని కోరినట్లు తెలుస్తోంది. తన వాదనలు పూర్తిగా వినలేదంటూ ఆయన పదేపదే మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపించింది. దీంతో జడ్జి అసహనం వ్యక్తం చేశారు. “నేను మీ రిట్ పిటిషన్‌ను డిస్మిస్ చేశానా?.. జడ్జీలు తమ ఆదేశాల ప్రకారమే వెళ్తారు.. మీరు పెద్ద సీనియర్ అడ్వొకేట్ అనుకుంటున్నారా..? పోలీసులను పిలవండి.. వెళ్లి అప్పీల్ చేసుకోండి” అంటూ జస్టిస్ రాజశేఖర్ రావు వ్యాఖ్యానించారు.

దీంతో కోర్టు హాల్‌లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. వెంటనే ఆ యువ న్యాయవాది చేతులు జోడించి.. “సారీ.. మీ క్షమాభిక్ష కోరుతున్నాను” అంటూ కోర్టును వేడుకున్నారు. తాను ఒత్తిడిలో ఉన్నానని, బాధలో మాట్లాడానని చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “కౌన్సిల్ నిర్లక్ష్యంగా ప్రవర్తించారు.. ఇక్కడ ఉన్న ఇతర న్యాయవాదులు కూడా ఇది చూశారు” అంటూ జడ్జి వ్యాఖ్యానించారు. కోర్టులో ఉన్న లాయర్ల పేర్లు నమోదు చేసి సాక్షులుగా రికార్డు చేయాలని కూడా సూచించారు.

వీడియో చూడండి..

అంతేకాకుండా ఆ న్యాయవాదిని 24 గంటల పాటు పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించినట్లు వీడియోలో వినిపించింది. దీంతో అక్కడున్న న్యాయవాదులు షాక్‌కు గురయ్యారు. మరోసారి యువ లాయర్ క్షమించమని కోరినా.. “ఇంకేం మాట్లాడొద్దు కౌన్సిల్” అంటూ జడ్జి స్పందించారు. ఇక “తర్వాత బార్ అసోసియేషన్‌తో కలిసి ధర్నా కూడా చేయండి” అంటూ కోర్టు చేసిన వ్యాఖ్య కూడా వీడియోలో వినిపించింది. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి.

తర్వాత హైకోర్టు బార్ అసోసియేషన్ రంగంలోకి దిగినట్లు సమాచారం. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేసింది. అనంతరం పోలీసు కస్టడీకి పంపాలన్న ఆదేశాలను కోర్టు వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, అసలు ఆ యువ న్యాయవాది ఏమన్నారు? ఏ వ్యాఖ్యతో కోర్టు కోపానికి గురయ్యారు? అన్నది మాత్రం పూర్తిగా బయటకు రాలేదు. కానీ కోర్టు వాయిదా నిర్ణయంపై పదేపదే అభ్యంతరం చెప్పడమే ఈ ఉద్రిక్తతకు కారణమైనట్లు లీగల్ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..