
SBI Credit Card New Rules: మీరు State Bank of India (SBI) క్రెడిట్ కార్డ్ వినియోగదారులా? అయితే మే 1, 2026 నుండి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలను తప్పకుండా తెలుసుకోవాలి. ఆలస్య చెల్లింపు ఛార్జీలు నుంచి వార్షిక రుసుము మినహాయింపుల వరకు పలు కీలక మార్పులను బ్యాంక్ ప్రకటించింది. ప్రతి నెల ప్రారంభంలో ఆర్థిక రంగంలో మార్పులు సాధారణమే. అయితే ఈసారి LPG ధరలు, ఇతర సేవలతో పాటు SBI క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో కూడా పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు ముఖ్యంగా కార్డ్ వినియోగదారుల ఖర్చు అలవాట్లపై ప్రభావం చూపే అవకాశముంది.
Read Also: US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్‌ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం!
బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇవాళ్టి నుంచి బకాయి చెల్లింపులపై వర్తించే ఆలస్య ఛార్జీల నిర్మాణాన్ని సవరించారు. ఇప్పటి వరకు రూ. 500 వరకు ఆలస్య చెల్లింపులపై ఎలాంటి ఛార్జీ ఉండేది కాదు. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఈ మినహాయింపు పరిమితిని రూ. 100కు తగ్గించారు. అంటే, రూ. 100 నుండి రూ. 500 మధ్య ఉన్న బకాయిలపై ఇప్పుడు రూ. 100 ఆలస్య చెల్లింపు ఛార్జీ వర్తిస్తుంది. అదే విధంగా, రూ. 500 నుండి రూ. 1000 మధ్య ఉన్న బకాయిలపై ఛార్జీని రూ. 400 నుంచి రూ. 500కు పెంచారు. అయితే రూ. 1000కి పైబడిన బకాయిలపై ఉన్న ఛార్జీలలో ఎలాంటి మార్పు లేదు. రూ. 1000–రూ.10000 వరకు రూ. 750, రూ.10000–రూ.25000 వరకు రూ. 950, రూ.25000–రూ.50000 వరకు రూ. 1100, రూ.50000కి పైబడిన బకాయిలపై రూ. 1300గా కొనసాగుతాయి.
ఇక వార్షిక రుసుము విషయంలో కూడా మార్పులు చేశారు. ముఖ్యంగా SBI BPCL Credit Card వినియోగదారులకు సంబంధించిన నిబంధనల్లో సవరణలు చోటు చేసుకున్నాయి. ఈ కార్డుకు సంబంధించిన రూ.499 వార్షిక ఫీజును మినహాయించాలంటే, ఇప్పుడు కస్టమర్లు ఏడాదికి కనీసం రూ.1,00,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఈ మినహాయింపు రూ.50,000 ఖర్చుపై వర్తించేది. కానీ, ఇప్పుడు ఆ పరిమితిని పెంచడంతో, తక్కువ ఖర్చు చేసే వినియోగదారులు వార్షిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పులు క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై ఆర్థిక భారం పెంచే అవకాశం ఉన్నప్పటికీ, ఖర్చులను సక్రమంగా ప్లాన్ చేసుకునే వారికి ప్రయోజనం కలిగించవచ్చు. కాబట్టి SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కొత్త నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకుని తమ ఖర్చులను నిర్వహించడం మంచిది.