July 15, 2026

Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్‌కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..

Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్‌కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
Reading Time: < 1 minute
Telangana Government Approves New Junior Civil Judge Court In Kataram Jayashankar Bhupalpally

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం రెవెన్యూ డివిజన్ ప్రజలకు భారీ ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం కాటారం డివిజన్‌లో జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) చేసిన ప్రతిపాదనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. న్యాయ, శాసన వ్యవహారాలు, న్యాయశాఖ కార్యదర్శి బి. పాపిరెడ్డి ఆదేశాల మేరకు ఈ సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కోర్టు ఏర్పాటుతో పాటు, అవసరమైన భవనాలు, సిబ్బంది నియామకం ఇతర వ్యయాల కోసం త్వరలోనే మరో జీవో జారీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇంతకు ముందు కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని కాటారం, మహదేవపూర్, మహముత్తారం, పలిమెల, మల్హర్ మండలాల ప్రజలు చిన్నపాటి న్యాయ సమస్యలకు కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా సామాన్యులు, న్యాయం పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొత్త కోర్టు మంజూరు చేయడంపై కాటారం డివిజన్ ప్రజలు, న్యాయవాదులు, స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై స్థానికంగానే న్యాయ సేవలు అందుబాటులోకి వస్తాయని, ప్రజల సమయం, డబ్బు ఆదా అవుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని, ప్రజలకు త్వరిత న్యాయం అందించడంలో ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.