Reading Time: < 1 minute
Ipl 2026 Shubman Gill Praises Bowlers And Fielding After Gts Dominant Win Over Rcb

Shubman Gill on GT Win Over RCB: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా రాణించారని ప్రశంసలు కురిపించారు. బలమైన ఆర్సీబీ జట్టును 160 పరుగులలోపే ఆపడం గొప్ప విజయమని పేర్కొన్నాడు. ఈ పిచ్‌పై ఆర్సీబీని తక్కువ పరుగులకే నియంత్రించడం నిజంగా సంతృప్తినిచ్చే విషయం అని చెప్పాడు. ఈ విజయానికి ప్రధాన కారణం ఫీల్డింగ్ అని గిల్ స్పష్టం చేశాడు. ఈ రోజు తన రోజు అని, తాను చాలా హ్యాపీగా ఉన్నట్లు శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు.

‘ఈ పిచ్‌పై ఆర్సీబీ లాంటి పటిష్ట జట్టును 160 పరుగులలోపే ఆపడం చాలా సంతృప్తినిచ్చింది. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మా విజయంలో ఫీల్డింగ్ కీలక పాత్ర పోషించింది. కొన్ని మ్యాచ్‌ల్లో మేము ఫీల్డింగ్‌లో తేలిపోయాం. కానీ ఈరోజు ప్రతి ఆటగాడు కలిసికట్టుగా ఆడాడు. ఫీల్డింగ్‌లో ఎనర్జీ చాలా బాగుంది. ముఖ్యంగా రెండో ఓవర్ తర్వాత విరాట్ భాయ్ కొన్ని పరుగులు కొట్టినా.. మేమంతా తిరిగి కలిసి పోరాడి మ్యాచ్‌ను కంట్రోల్‌లోకి తీసుకువచ్చాం. అది మ్యాచులో చాలా కీలకంగా మారింది’ అని శుభ్‌మన్ గిల్ తెలిపాడు.

‘పవర్‌ప్లేలో దూకుడుగా ఆడాలని ముందే అనుకోలేదు. నేను నా సహజ శైలి ఆటనే ఆడాను. మొదటి బంతికి కొంచెం అదృష్టం కలిసొచ్చింది. రెండో బంతి తర్వాత నేను మంచి ఫ్లోలోకి వచ్చాను. అప్పుడే ఇవాళ నా రోజు కావచ్చు అనిపించింది. నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకే బౌలర్లపై దాడి చేయాలని అనుకున్నాను. రాహుల్ తెవాటియా మా జట్టుకు చాలా ముఖ్యమైన ఆటగాడు. అతడు మ్యాచ్‌ను ఫినిష్ చేయడం చాలా సంతోషంగా ఉంది. టైమ్‌అవుట్ సమయంలో ఇదే విషయంపై మాట్లాడుకున్నాం. మధ్యలో కొన్ని వికెట్లు కోల్పోయినా.. చివర్లో అతడు కీలక పరుగులు చేశాడు. అందరూ తమ వంతు పాత్ర పోషించారు. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని గిల్ చెప్పాడు.