Reading Time: < 1 minute

రేవంత్ రెడ్డి రైతు బిడ్డ కాదు.. రైతు ద్రోహి : మాజీ మంత్రి హరీశ్ రావు

Caption of Image.

సిద్దిపేట రూరల్, వెలుగు: రేవంత్ రెడ్డి రైతు బిడ్డ కాదు.. రైతు ద్రోహి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. బుధవారం నారాయణరావుపేట మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయక రైతులు గోస పడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డికి తిట్ల పురాణం తప్ప ఏమి రాదని, ఆయనకు కేసీఆర్ ను, తనను తిట్టడం తప్ప ఏమి తెలియదన్నారు. ఆయన ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడడం కాదని, దమ్ముంటే రైతుల దగ్గరికు వచ్చి మాట్లాడాలన్నారు. సీఎంతో పాటు ఎమ్మెల్యే లు, మంత్రులు కూడా రైతులను పట్టించుకోవడం లేదన్నారు. కల్లాల్లోకి రాకుండా ఆన్ లైన్  పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని, కొన్ని జిల్లాల్లో ఐదు కిలోల వరకు తరుగు తీస్తున్నారని విమర్శించారు.

శనగలు, మక్కలు, సన్ ఫ్లవర్  కొనకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, కుప్పల దగ్గర పది రోజులుగా నిద్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని, లేదంటే రహదారులు దిగ్భంధం చేసి కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తామన్నారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ హైమావతితో ఫోన్  లో మాట్లాడి వడ్లు కొనుగోలు చేసేలా చూడాలన్నారు. అలాగే పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ బాలకృష్ణ, సర్పంచ్  బొంగురం ఎల్లారెడ్డి, సత్తయ్య, నాయకులు ఎల్లారెడ్డి, ఆకుల హరీశ్, చందు, సంతోష్  పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.