
నేడు కోల్‌కతాతో చెన్నై ఢీ
చెన్నై: ఐపిఎల్‌లోభాగంగా మంగళవారం జరిగే కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. కోల్‌కతా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేదు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో ఒక పాయింట్ లభించింది. ఇది తప్పిస్తే మిగిలిన మూడు మ్యాచుల్లోనూ కోల్‌కతా ఓటమి చవిచూసింది. ఇలాంటి స్థితిలో చెన్నైతో జరిగే పోరు కెకెఆర్‌కు కీలకమనే చెప్పాలి. ఇక చెన్నై కిందటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి బోణీ కొట్టింది. ఇదే జోరును కోల్‌కతాపై కూడా కొనసాగించాలనే భావిస్తోంది.
సంజు శాంసన్ ఢిల్లీపై అజేయ శతకం సాధించి ఫామ్‌లోకి వచ్చాడు. ఇది సిఎస్‌కు సానుకూల పరిణామంగా చెప్పాలి. శాంసన్ గాడిలో పడడంతో చెన్నై బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోయాయి. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా శాంసన్‌కు ఉంది. ఈ మ్యాచ్‌లో అతను విజృంభిస్తే జట్టుకు భారీ స్కోరు సాధించడం కష్టం కాదు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రమే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబె, డెవాల్డ్ బ్రెవిస్, మాథ్యూ షార్ట్ తదితరులతో చెన్నై బ్యాటింగ్ బలోపేతంగా ఉంది. బౌలింగ్‌లో కూడా జట్టు బాగానే కనిపిస్తోంది. దీనికి తోడు సొంత గడ్డపై ఆడుతుండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా మారింది. దీంతో చెన్నై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కోల్‌కతా టీమ్‌లో కూడా స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు.
కెప్టెన్ అజింక్య రహానె, ఫిన్ అలెన్, రఘువంశీ, కామెరూన్ గ్రీన్, రింకు సింగ్, రొమన్ పొవెల్, సునీల్ నరైన్, రమణ్‌దీప్ సింగ్ వంటి మ్యాచ్ విన్నర్‌లు జట్టులో ఉన్నారు. అయితే గ్రీన్ వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. అయితే కిందటి మ్యాచ్‌లో అతను రాణించడం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పాలి. రహానె, రఘువంశీలు ఈ మ్యాచ్‌లో కూడా జట్టుకు కీలకంగా మారారు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత వీరిపై నెలకొంది. నవదీప్ సైని, కార్తిక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి, ముజరబ్బాని తదితరులతో జట్టు బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో కోల్‌కతా కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది.