Reading Time: 3 minutes

బడిలో నుంచి గెంటేసినా… చిన్నతనం నుంచే ఊరి అవతలికి నెట్టినా.. అవమాన, చీత్కారాలకు గురైనా వాటిని కసిగా మలుచుకొని అసమానతలు లేని సమాజం కోసం.. కృషి చేసి భారతదేశానికి ఆయన వెలుగు అయ్యాడు. వీధి దీపపు వెలుగు కింద చదువుకున్న ఆయన నేడు భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించి.. ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపిన త్యాగశీలి. తల్లి కడుపులో ఉన్న పసిబిడ్డ నుంచి పండుముసలి వరకు అందరికీ సమానమైన హక్కులు కల్పించడానికి తన సర్వస్వం ధారబోసిన మహోన్నతమూర్తి అంబేద్కర్. మహారాష్ట్రలోని సతారా జిల్లా అంబవాడ గ్రామంలో అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న రాంజీ-భీమాబాయి దంపతులకు పద్నాలుగవ సంతానంగా జన్మించాడు. పుట్టుక అనేది మనిషి అవకాశాలను, గౌరవాన్ని అస్తిత్వాన్ని అడ్డుకోకూడదు అని స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం ప్రతి భారతీయుని ప్రాథమిక హక్కు కావాలన్నారు. బిడ్డ చనిపోయాడు తెల్లగుడ్డ కొనుక్కురండి. కప్పడానికి అన్నారెవరో… ఆ ఇంట్లో నాలుగు గింజలు బియ్యం లేవు.. ఇక తెల్లగుడ్డు ఎక్కడి నుంచి తెస్తారు వెంటనే ఆ తల్లి చీర సగం చించి ఇచ్చింది. ఆ గుడ్డ కప్పి బిడ్డ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు అలా మట్టిలో కలిసిపోయిన బిడ్డలు ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు.

కటిక పేదరికంతో కన్నబిడ్డలను పోగొట్టుకున్న వ్యక్తి మరెవరో కాదు అంబేద్కర్. దేశంలోని దళిత జనావళి ఆత్మగౌరవంతో బతికేందుకు సర్వస్వం త్యాగం చేసిన అంబేద్కర్ ఆయన రెండో కొడుకు గంగాధర్ మరణించినప్పటి సందర్భం.. ఒక బిడ్డ చనిపోతే కప్పేందుకు తెల్లగుడ్డ కూడా లేదు దుర్భర దారిద్య్రాన్ని అనుభవించాను. ప్రభుత్వ ఉద్యోగమో, ప్రైవేటు ఉద్యోగమో చేయకూడదా అని భావించాను. కానీ ఒకవేళ ఉద్యోగం చేసినట్లయితే అంటరాని వారి పరిస్థితి ఏమవుతుంది? నా బిడ్డ గంగాధర్ కంటే తీవ్ర అనారోగ్యం బారిన పడతారని అంబేద్కర్ 1943 డిసెంబర్ 12న పృథ్వీరాజ్ రోడ్డులో ఆవేదన చెందారు. ఆయన విద్యాభ్యాసం పూర్తయినా, ఎటువంటి హోదా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దళిత అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన త్యాగం ఈ విశ్వం ఉన్నంత వరకు చెరపని అధ్యాయం. ఆయన సర్వస్వం త్యాగం వల్లే నేటి ఈ బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ హక్కులతోకూడిన స్వేచ్ఛా బతుకులు. రాజ్యాంగ రచన పరిషత్‌కు ఎన్నిక కాకుండా అంబేద్కర్‌ను ఎన్నో రకాలుగా అడ్డుకున్నారు.

అయినప్పటికీ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్‌కు ఎంపిక కావడంకోసం ఆనాడు జోగింద్రనాథ్ మండల్ తన ఎంపి పదవికి రాజీనామా చేసి పశ్చిమబెంగాల్ లోని కల్నల్ నియోజకవర్గం నుంచి ఆయనను ఎన్నికలలో నిలబెడితే అక్కడ గెలుపొంది.. రాజ్యాంగ పరిషత్‌కు ఎంపికై రాజ్యాంగ రచన కమిటీకి చైరన్‌గా ఎన్నికై నేడు భారతదేశంలోని పౌరులందరికీ గొప్ప స్వేచ్ఛను కల్పించారు. భాగ్యనగరం హైదరాబాద్‌తోనూ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ఎంతో అనుబంధం ఉంది. హైదరాబాద్‌లో జరిగే అనేక సభలకు హాజరయ్యేందుకు వచ్చేవారు. 1952లో అంబేద్కర్‌కు ఉస్మానియా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది అప్పటి చిట్టచివరి నిజాం అయినా మీర్ ఉస్మాన్ అలీఖాన్. అంబేడ్కర్‌ను హైదరాబాద్‌కు చీఫ్ జస్టిస్‌గా ఉండాలని కోరినాడు. అయినా అంబేడ్కర్ తిరస్కరించారు. అలాగే కేంద్రంలో హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టకపోవడాన్ని నిరసిస్తూ తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం దళితులకే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తికి హక్కులు ప్రసాదించిన త్యాగమూర్తి. ఆయనను స్మరించుకోవడంతోపాటు తన ఆశయ సాధనలో భారతదేశ సమాజమంతా పయనించగలిగినప్పుడే ఆయన కన్న కలలు నెరవేరుతాయి. ఆ దిశగా దళిత, బడుగు బలహీన వర్గాలు చైతన్యంతో ముందుకు కదలాల్సిన ఆవశ్యకత ఉంది. నేను నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోయాను. నా ప్రజల్ని పాలక వర్గంగా చూడాలని అనుకున్నాను. వాళ్లు ఇతర కులాల ప్రజలతో సమాన ప్రాతిపదికన రాజకీయ అధికారాన్ని పంచుకోవాలని అనుకున్నాను.. నేనేదైతే సాధించగలిగానో.. దాన్ని కొందరు విద్యాధికులు మాత్రమే అనుభవించగలిగారు. వాళ్లు తమ మోసపూరితమైన ఆచరణద్వారా ఉత్త పనికిమాలిన సరుకని రుజువు చేసుకున్నారు. వాళ్లకి తమ అణగారిన సోదరుల పట్ల ఎటువంటి సానుభూతీ లేదు. వాళ్లు నా అంచనాల్ని మించిపోయారు. వాళ్లు తమకోసమే బతుకుతారు. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే బతుకుతారు.

వాళ్లలో ఒక్క మనిషి కూడా సామాజిక కార్యక్రమం చేసేందుకు సిద్ధం కాదు. వాళ్లు వినాశకరమైన పథంలో సాగిపోతున్నారు. నేను ఇప్పుడు నా దృష్టిని నిరక్షరాస్యులైన గ్రామీణ జనబాహుళ్యం వైపు మళ్లించాలనుకుంటున్నాను. వాళ్లు ఇంకా కష్టాల కడలిలోనే వున్నారు. ఆర్థికంగా వాళ్ల పరిస్థితి ఏమీ మారలేదు అని అంబేద్కర్ ఆవేదన చెందారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 1936: కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం స్థాపించారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ 1942లో దళితుల రాజకీయ హక్కుల కోసం ఏర్పాటు చేసిన పార్టీ. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 1956 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్‌ను మరింత విస్తృత పరిచి, రిపబ్లికన్ పార్టీగా మార్చారు. రాజకీయ చైతన్యం కోసం కృషి చేశారు. విద్యను ప్రోత్సహించడానికి ఆయన బహిష్కృత హితకారిణి సభను స్థాపించారు. అణగారిన వర్గాల గురించి మరింతగా రాయడానికి ఆయన మూక్‌నాయక్, బహిష్కృత భారత్, సమతా, జనతా, ప్రబుద్ధ భారత్ అనే ఐదు పత్రికలను ప్రారంభించారు. సమాజాన్ని మార్చడానికి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాలను ఉపయోగిస్తూ భారతదేశానికి ఓ దారిచూపిన గొప్ప వెలుగు భారతరత్న అంబేద్కర్.. ఆయన పొందుపరిచిన ఆర్టికల్ 3 వల్లనే నేడు మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సాకారమైంది. 

– సంపత్ గడ్డం, 7893303516

– నేడు బిఆర్ అంబేద్కర్ జయంతి