
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ శాంతి చర్చల వేళ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని త్వరలోనే తిరిగి తెరుస్తామని ప్రకటించారు. శాంతి చర్చలలో ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకుండా చూడటమే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. శాంతి చర్చలకు ఇరాన్ అంగీకరించకుంటే ఇప్పటి వరకు చూడని భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. శాంతి చర్చల ప్రారంభానికి గంటల ముందు ట్రంప్ చేసిన హాట్ కామెంట్స్‌పై ఇరాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలీ.
పశ్చిమాసియాలో దాదాపు ఆరు వారాలుగా సాగుతోన్న యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో శాంతి చర్చల కోసం అమెరికా, ఇరాన్ బృందాలు పాకిస్తాన్ చేరుకున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నాయకత్వంలోని ఇరాన్ టీమ్ శనివారం (ఏప్రిల్ 10) పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ల్యాండ్ అయ్యాయి.
ఇరాన్ ప్రతినిధి బృందానికి పాక్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్, అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ స్వాగతం పలికారు. ఇస్లామాబాద్‌లోని సెరీన్ హోటల్‌లో శాంతి చర్చలు జరగనున్నాయి. ఇరుదేశాల ప్రతినిధి బృందాలు మొదట పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్‌తో విడివిడిగా సమావేశమవుతాయి.
ఆ తర్వాత ప్రత్యక్ష చర్చలు జరుపుతాయి. అమెరికాఇరాన్ శాంతి చర్చల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇస్లామాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. నగరం మొత్తం లాక్ డౌన్ విధించి భారీగా బలగాలను మోహరించారు. చర్చలు జరగనున్న సెరెన్ హోటల్ పరిసరాల్లో కర్ఫ్యూ విధించి భద్రతను కట్టుదిట్టం చేశారు.