
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న వివక్షను ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మన దగ్గర పన్నులు వసూలు చేస్తూ ఉత్తరాదికి నిధులు ధారపోస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు డిలిమిటేషన్ పేరుతో ఉత్తరాదిలో ఎంపీ స్థానాలను పెంచి దక్షిణాది ప్రాధాన్యతను తగ్గించే కుట్ర జరుగుతోందన్నారు. దక్షిణాది గొంతు నొక్కాలని చూస్తున్న ఈ రాజకీయ కుట్రలను బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు ఏకమై తిప్పికొట్టాలన్నారు. సామాజిక మార్పు కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు భట్టి.
మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న భట్టి విక్రమార్క.. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో కుల గణన చేపట్టి ఆదర్శంగా నిలిచామన్నారు . బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అందించాలనే పట్టుదలతో ఢిల్లీ వేదికగా ధర్నా కూడా చేశామని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం మన చట్టాన్ని ఆమోదించకుండా కాలయాపన చేస్తోందన్నారు. తెలంగాణ గడ్డపై సామాజిక న్యాయమే లక్ష్యంగా.. ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో, సామాజిక స్పృహతో కూడిన పాలనను అందిస్తున్నామని అన్నారు భట్టి విక్రమార్క.
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ఊపిరిగా తీసుకుని కుల వివక్ష లేని సమాజం కోసం మేము అడుగులు వేస్తున్నామన్నారు భట్టి. ఆనాడు పూలే లాంటి మహనీయులే వివక్షకు గురైనా భవిష్యత్ తరాల కోసం వారు వేసిన పునాదులే మార్గదర్శకాలన్నారు భట్టి.