Reading Time: 2 minutes

Dhurandhar 2 OTT Release: ఓటీటీలోకి ‘ధురంధర్ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Caption of Image.

భారతీయ సినీ పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ధురంధర్2’ కేవలం సినిమాగానే కాకుండా ఒక బాక్సాఫీస్ సునామీలా దూసుకుపోతోంది.  ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం విడుదలైన 22వ రోజులైనా ఏమాత్రం జోరు తగ్గకుండా థియేటర్లలో పరుగును కొనసాగిస్తోంది. 

‘ధురంధర్ 2’ దూకుడు!

ఈ మూవీ కలెక్షన్స్  ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తూ సరికొత్త రికార్డులను సృష్టించింది. కేవలం మూడు వారాల్లోనే భారతదేశంలో రూ. 1,041.27 కోట్ల నికర వసూళ్లను సాధించి, ఈ ఘనత సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు భారతదేశంలో గ్రాస్ వసూళ్లు రూ. 1,246.67 కోట్లు కాగా, విదేశీ మార్కెట్‌లో రూ. 407 కోట్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 1,653.67 కోట్లను కొల్లగొట్టింది. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

భారీ ధరకు ఓటీటీ డీల్..

సినిమా థియేటర్లలో రచ్చ కొనసాగుతున్న తరుణంలోనే దీని డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. మొదటి భాగం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండగా, ఈ సీక్వెల్ హక్కులను భారీ ధరతో జియోహాట్‌స్టార్ (JioHotstar) దక్కించుకుంది. తాజా ఒప్పందం ప్రకారం, థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల వరకు ఈ చిత్రం ఓటీటీలోకి రాదు. ‘బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్’ను గౌరవిస్తూ నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

స్ట్రీమింగ్ ఎప్పుడు?

ఐపీఎల్ (IPL 2026) ముగిసిన తర్వాత, అంటే మే నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో ఈ చిత్రం జియోహాట్‌స్టార్‌లో సందడి చేయనుంది. క్రికెట్ మేనియా తగ్గగానే సినీ ప్రియులను అలరించేందుకు ఇదే సరైన సమయమని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగా రాబట్టడంతో థియేటర్లలో ఇంకా ఈ సినిమాను రన్ చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.  ఐపీఎల్ ముగిసిన తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు వెళ్తే మరింతమంది ప్రేక్షకులకు చేరువ అయ్యే అవకాశం ఉందని మేకర్స్ తో ఓటీటీ సంస్థ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ALSO READ : ‘ధురంధర్ 2’ కు కాపీరైట్ చిక్కులు

ఆదిత్య ధర్ విజన్

రణవీర్ సింగ్ తన పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో ఎలైట్ స్పై పాత్రలో జీవించగా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటుల కలయిక ఈ చిత్రానికి మరింత వెయిటేజ్ ఇచ్చింది. ఆదిత్య ధర్ మేకింగ్ వాల్యూస్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడుతున్నాయి. మొత్తానికి, ‘ధురంధర్’ కేవలం ఒక హిట్‌గా మాత్రమే కాకుండా, ఇండియన్ సినిమా గర్వించదగ్గ లెజెండరీ చిత్రాల జాబితాలో చేరిపోయింది.
 

 

©️ VIL Media Pvt Ltd.