
లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా గ్రూపుకు పెద్ద దెబ్బ తగిలింది. హిజ్బుల్లా ప్రస్తుత లీడర్ నయీమ్ ఖాసెమ్‌కు అత్యంత సన్నిహితుడు, ఆయన మేనల్లుడు అయిన అలీ యూసుఫ్ హర్షి ఈ దాడుల్లో చనిపోయినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) వెల్లడించాయి.
ఎవరీ అలీ యూసుఫ్ హర్షి
అలీ యూసుఫ్ హర్షి కేవలం బంధువు మాత్రమే కాదు, నయీమ్ ఖాసెమ్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా, సలహాదారుడిగా పనిచేశారు. నయీమ్ ఖాసెమ్ ఆఫీసు పనులను చూసుకోవడంతో పాటు, ఆయన భద్రతను పర్యవేక్షించడంలో అలీ యూసుఫ్ హర్షి కీలక పాత్ర పోషించేవారు.
ఇజ్రాయెల్ సైన్యం కేవలం వ్యక్తులనే కాకుండా, హిజ్బుల్లాకు సంబంధించిన మౌలిక సదుపాయాలను కూడా టార్గెట్ చేసుకుంది. ఆయుధాలు, రాకెట్లు, లాంచర్లను ఒక చోటు నుండి మరోచోటుకు తరలించడానికి హిజ్బుల్లా ఉపయోగించే రెండు ముఖ్య దారులపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది.
దక్షిణ లెబనాన్‌లోని సుమారు 10 ఆయుధ నిల్వ కేంద్రాలు, రాకెట్లు ప్రయోగించే స్థావరాలు సహా హిజ్బుల్లా కార్యాలయాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.
ALSO READ : ఒక్క పని సక్కగా చేయడం చేత కాదు
హిజ్బుల్లా నాయకుడికి కుడిభుజం లాంటి వ్యక్తిని హతమార్చడం ద్వారా ఇజ్రాయెల్ ఆ సంస్థను మరింత బలహీనపరిచే ప్రయత్నం చేస్తోంది. దీనివల్ల హిజ్బుల్లా అంతర్గత కార్యకలాపాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.