Reading Time: 2 minutes

‘ధురంధర్ 2’ కు కాపీరైట్ చిక్కులు.. కోర్టుకెక్కిన ‘త్రిదేవ్’ మేకర్స్!

Caption of Image.

బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’ మూవీ దూసుకెళ్తోంది.  ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 1640 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా ఇప్పుడు చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది.  ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ త్రిమూర్తి ఫిలింస్, బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ నిర్మాణ సంస్థ ‘B62 స్టూడియోస్’ పై చట్టపరమైన చర్యలకు దిగింది.  తమ అనుమతి లేకుండా ‘త్రిదేవ్’ (1989) చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ “తిర్చి టోపీవాలే”ను ‘ధురంధర్ 2’ సినిమాలో వాడారంటూ బాంబే హైకోర్టులో దావా వేసింది. కాపీరైట్ ఉల్లంఘన కింద ఈ కేసు నమోదైంది.

వివాదం నేపథ్యం ఏమిటి?

కళ్యాణ్ జీ-ఆనంద్ జీ సంగీతం అందించిన “తిర్చి టోపీవాలే” సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఆనంద్ బక్షి సాహిత్యం, అమిత్ కుమార్, సప్నా ముఖర్జీ గాత్రం ఈ పాటను ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలబెట్టాయి. అయితే ‘ధురంధర్ 2’ చిత్రంలోని “రంగ్ దే లాల్” అనే పాటలో ఈ ఒరిజినల్ ట్యూన్‌ను వాడారని త్రిమూర్తి ఫిలింస్ ఆరోపిస్తోంది. మ్యూజికల్ కంపోజిషన్, సౌండ్ రికార్డింగ్‌పై తమకు పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నాయని, కనీస అనుమతులు తీసుకోకుండా దీనిని వాడటం తమ కాపీరైట్స్ ను ఉల్లంఘించడమేనని  వారు వాదిస్తున్నారు. ఈ మేరకు పాట ప్రసారాలను నిలిపివేయాలని, నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఇంజంక్షన్ ఆర్డర్ కోరారు.

క్రెడిట్స్ ఇచ్చినా తప్పదా?

చిత్ర యూనిట్ ‘రంగ్ దే లాల్’ లిరికల్ వీడియోలో ఒరిజినల్ కంపోజర్స్ కళ్యాణ్ జీ-ఆనంద్ జీ పేర్లను, గాయకుడు అమిత్ కుమార్ పేరును క్రెడిట్స్‌లో పేర్కొంది. శశ్వత్ సచ్‌దేవ్ ఈ రీమిక్స్ వెర్షన్‌ను రూపొందించగా, జాస్మిన్ సాండ్లాస్, అఫ్సానా ఖాన్ వంటి వారు కొత్త గాత్రాన్ని అందించారు. అయితే, కేవలం పేరు వేయడం వల్ల చట్టపరమైన హక్కులు లభించవని, ఆర్థికపరమైన ఒప్పందాలు లేదా లైసెన్స్ తప్పనిసరని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

►ALSO READ | కేరళ పోలింగ్ : ఉత్సాహంగా ఓటు వేసిన మళయాళం సినిమా హీరోలు

 ‘ధురంధర్ 2’ దూకుడు..

వివాదాలు ఒకవైపు ఉన్నా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ఇండియాలో  గ్రాస్ రూ. 1237 కోట్లకు చేరుకోగా.. ప్రపంచ వ్యాప్తంగా 1641. 21 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా.. ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది

భారీ వసూళ్లతో దూసుకుపోతున్న తరుణంలో ఈ చట్టపరమైన చిక్కులు సినిమా డిజిటల్, స్ట్రీమింగ్ హక్కులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. సినిమా ఇండస్ట్రీలో రీమిక్స్ సంస్కృతి పెరిగిపోతున్న వేళ, ఈ వివాదం కాపీరైట్ చట్టాల ప్రాధాన్యతను మరోసారి చర్చకు తెచ్చింది.
 

 

©️ VIL Media Pvt Ltd.