
- చివరి దశలో తడులు అందక ఎండుతున్న పంటలు
- తూముల దగ్గర నిద్రిస్తూ నీటి కోసం రైతుల ఎదురుచూపులు
- ఉమ్మడి పాలమూరులో దయనీయ పరిస్థితి
నాగర్‌కర్నూల్, వెలుగు: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్‌ఐ) కింద సాగుచేసిన మొక్కజొన్న, వేరుశెనగ, వరి పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ లిఫ్ట్ ఎల్లూరు నుంచి రోజుకు 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నా కింది ప్రాంతాలకు సరైన స్థాయిలో చేరడం లేదు. నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో దాదాపు 2.80 లక్షల ఎకరాల్లో సాగుచేసిన పంటలు చివరి దశలో ఉండగా తడి ఆరుతున్నాయి. బోర్లు ఉన్న రైతులు కొంతవరకు తడులు అందిస్తున్నా.. మిగతా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రధాన కాల్వల తూముల వద్ద నీరు కిందికి వదలాలని కోరుతూ రైతులు రాత్రిళ్లు పడిగాపులు పడుతున్నారు.
శ్రీశైలం డ్యామ్‌లో డెడ్‌స్టోరేజీ..
శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 43 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అందులో 30 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కింద ఉండటంతో మిగిలిన 13 టీఎంసీలతోనే ఎండాకాలంలో అవసరాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిషన్ భగీరథ పథకం కింద ఏడు జిల్లాలకు తాగునీరు అందించేందుకు ఎల్లూరు రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా చేస్తున్నారు. మూడు నెలల పాటు తాగునీటి కోసం కనీసం ఆరు టీఎంసీల నీరు అవసరమవుతాయని అంచనా.
విద్యుత్ పీక్ డిమాండ్ కారణంగా గత వారం వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడంతో నీటి వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో కేఎల్‌ఐ ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలుగకుండా శ్రీశైలం నుంచి ఏపీ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కశిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి దోమలపెంట వద్ద ధర్నాకు సిద్ధమయ్యారు.
నీటి నిల్వలు తగ్గుముఖం..
కేఎల్‌ఐలోని నాలుగు జలాశయాల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతుండటంతో ప్రస్తుత పంటలను కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది. ఎల్లూరు నుంచి సింగోటం, అక్కడి నుంచి జొన్నలబొగడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్ల ద్వారా నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలకు సాగునీరు రావాల్సి ఉన్నా ప్రధాన కాల్వపై ఏర్పాటు చేసిన తూములు, పస్పుల, ఘనపూర్, బుద్డారం బ్రాంచ్ కాల్వల ద్వారా వనపర్తి వైపు మళ్లించారు. దీంతో ప్రధాన కాల్వలో నీటి ప్రవాహం తగ్గి 29, 30 ప్యాకేజీల కింద ఉన్న రైతులకు సాగునీరు అందడం లేదు.
వనపర్తికి తరలించడంతో..
గుడిపల్లిగట్టు రిజర్వాయర్‌కు రోజుకు 1,800 క్యూసెక్కుల నీరు తరలిస్తున్నారు. ఇదే సమయంలో నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలకు కూడా అంతే మోతాదులో నీరు ఇవ్వాల్సి ఉంది. అయితే ఘనపూర్ బ్రాంచ్ కాల్వ ద్వారా వనపర్తి ప్రాంతానికి నీరు మళ్లించడంతో ప్రధాన కాల్వలో ప్రవాహం తగ్గింది. దీంతో కల్వకుర్తి మండలం తిమ్మరాశిపల్లి వరకు నీరు చేరడం కష్టంగా మారింది.
గుడిపల్లిగట్టు నుంచి విడుదల చేసే నీటిలో 700 క్యూసెక్కుల వరకు అచ్చంపేట మెయిన్ కాల్వకు మళ్లిస్తుండగా, అక్కడ పంట కోతలు పూర్తయ్యినా నీరు వదలడంతో ఎక్కువ భాగం డిండి వాగులో కలుస్తోంది. మరోవైపు ఘనపూర్ బ్రాంచ్ కాల్వకు నీరు నిలిపివేయడంతో అక్కడి రైతులు ఆందోళన చేస్తున్నారు. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి ప్రాంతాలకు 800 క్యూసెక్కులకే పరిమితం చేయడంతో సమస్యలు మరింత పెరిగాయి. పలు చోట్ల కాల్వలపై మోటార్లు పెట్టి నీటిని ఎత్తిపోస్తుండటంతో కింది ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పర్యవేక్షణ లోపం..
జలాశయాల్లో నీటి నిల్వలు, సాగు అవసరాలపై ప్రతి ఏడాది నిర్వహించాల్సిన ఐడీబీ సమావేశాలు గత రెండేళ్లుగా జరగకపోవడంతో ప్రణాళికలో లోపాలు కనిపిస్తున్నాయని రైతులు విమర్శిస్తున్నారు. గతంలో ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లు సమావేశమై నీటి వినియోగంపై నిర్ణయాలు తీసుకునేవారని అంటున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్ విభాగంలో ఇన్‌చార్జ్ అధికారులే ఉండడం నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపిస్తున్నారు. జొన్నలబొగడ నుంచి గుడిపల్లిగట్టు వరకు కాల్వల షటర్ల నిర్వహణ, పర్యవేక్షణ లోపించడంతో కొన్నిచోట్ల నీరు వృథాగా వాగుల్లో కలుస్తుండగా, మరికొన్ని చోట్ల కాల్వలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
వనపర్తి, వెలుగు: వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా వనపర్తి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 37 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏసీలు, ఫ్యాన్ల వాడకం పెరిగింది. అంతేగాకుండా రైతులు బోర్లపై ఆధారపడడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. గత సంవత్సరం మార్చి మొదటి వారంలో రోజుకు సుమారు 50 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా, ఈ ఏడాది అది 70 లక్షల యూనిట్లకు చేరింది.
అంటే రోజుకు దాదాపు 20 లక్షల యూనిట్లు అదనంగా వినియోగం అవుతోంది. రబీ సీజన్‌లో వరి పంటలకు అధికంగా సాగునీరు అవసరం. ఈసారి జిల్లాలో సుమారు 1.75 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. జిల్లాలోని శ్రీరంగాపూర్, వీపనగండ్ల, చిన్నంబావి, పెంట్లవెల్లి మండలాలకు జూరాల ప్రాజెక్టు, భీమా ఫేజ్–2 కాల్వల ద్వారా సాగునీరు అందకపోవడంతో చివరి ఆయకట్టు రైతులు బోరుబావులపై ఆధారపడుతున్నారు.