
తెలంగాణలో వరి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రబీ సీజన్‌కు సంబంధించి కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 8,251 కేంద్రాల్లో అధికారులు దీనికి ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. వేసవి కాలం నేపథ్యంలో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రైతులు నష్టపోకుండా ఎక్కువ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. ఇక ధాన్యం అమ్మిన తర్వాత రెండు రోజుల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. అలాగే సన్నరకం వడ్లకు ఇచ్చే బోనస్‌ను కూడా వెంటనే జమ చేయనున్నారు. సన్నరకం బియ్యంపై క్వింటాకు రూ.500 రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఆ బోనస్ కూడా వెంటనే పంపిణీ చేయనున్నారు.
ఈ సారి భారీగా దిగుబడి
ఈ రబీ సీజన్‌లో మొత్తం 90 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో మొత్తం 54.48 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. దాదాపు 152.03 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా.. ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ప్రతీ ఏడాది వరి సాగు అనేది పెరుగుతూనే ఉంది. 2024-25 రబీ సీజన్‌లో 137.10 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అయితే ప్రభుత్వం 70.13 లక్షల టన్నులు సేకరించాలని భావించగా.. అంతకంటే ఎక్కువగా ఏకంగా 73.70 లక్షలు వచ్చింది. ఈ సారి 90 లక్షల టన్నులు సేకరించాలని లక్ష్యం పెట్టుకుంది.
ప్రారంభమైన సేకరణ ప్రక్రియ
అయితే రాష్ట్రంలో ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద సేకరణ ప్రారంభమైంది. అయితే అరబెట్టిన తర్వాత నిర్ణీత తేమ శాతం వచ్చాకే కాంటాలు వేస్తామని నిర్వహాకులు చెబుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన కాంటాలు మాత్రం వేయడం లేదని రైతులు చెబుతున్నారు. కాంటాలు వేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. డబ్బులు వెంటనే అవసరమైన రైతులు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. దీంతో రైతులు ధర తగ్గించి రైతుల వద్ద నుంచి తీసుకుంటున్నారు. మరోవైపు రైతులకు రైతు భరోసా ప్రభుత్వం జమ చేస్తోంది. తొలి విడత ఇప్పటికే జమ చేయగా.. రెండో విడత సొమ్మును ఈ నెల 15వ తేదీ నుంచి అకౌంట్లలోకి రిలీజ్ చేయనుంది. ఇక ఏప్రిల్ చివరికల్లా మూడో విడత నిధులను అందించనుంది. దీంతో రెండో విడత కసం రైతులు ఎదురుచూస్తున్నారు.