Reading Time: < 1 minute
Konaseema: అరె.. అన్‌సీజన్‌లో చిక్కిన పులస.. ఎంత ధర పలికిందో తెలుసా..?

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అరుదైన సంఘటన చోటుచేసుకుని పులస ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించింది. పి.గన్నవరం ప్రాంతంలో గోదావరి నదిలో అన్‌సీజన్‌లో పులస చేప జాలరకు చిక్కడం విశేషంగా మారింది. సాధారణంగా వరద కాలంలో మాత్రమే కనిపించే ఈ పులస, ఏప్రిల్ నెలలో దొరకడం చాలా అరుదైన విషయం కావడంతో స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. జాలరకు చిక్కిన ఆ పులసను పి.గన్నవరం చేపల మార్కెట్‌కు తీసుకురాగానే, పులస ప్రియులు దానిని కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో మార్కెట్‌లో ఆ చేపకు భారీ ధర పలికింది. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో వరదల సమయంలో ఎర్రని నీటిలో ఎగబడి వచ్చే పులస చేప, ఇప్పుడు అన్‌సీజన్‌లో దొరకడంతో అరుదైన వస్తువుగా మారింది.

దీంతో ఆ చేప ధర అమాంతం పెరిగి ఏకంగా రూ.4,000 వరకు చేరింది. చివరకు ఒక పులస ప్రియుడు ఆ చేపను ఆ ధరకు సొంతం చేసుకున్నాడు. అయితే కొనుగోలు చేసిన వ్యక్తి కంటే, ఈ అరుదైన పులసను చూసేందుకు వచ్చిన జనమే ఎక్కువగా కనిపించడం ప్రత్యేకంగా నిలిచింది. అన్‌సీజన్‌లో పులస రావడం సహజంగా చాలా అరుదు అని, అందుకే చిన్న పరిమాణంలో ఉన్నా కూడా ఈ స్థాయి ధర పలికిందని స్థానికులు చెబుతున్నారు. మొత్తానికి, పి.గన్నవరం చేపల మార్కెట్‌లో ఈ అరుదైన పులస హాట్ టాపిక్‌గా మారి, అక్కడి వాతావరణాన్ని సందడిగా మార్చింది.

Also Read:  ఈ ఒక్క పని చేస్తే పిండి పురుగు అంతా మాడి మసైపోద్ది అంతే..