
- ఈ సర్వే నివేదిక సామాజిక తెలంగాణ ఎక్స్రే
- ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి
బషీర్బాగ్, వెలుగు: రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా కుల సర్వే రిపోర్టును వెంటనే ప్రజల ముందుంచాలని సమాజ్వాది పార్టీ డిమాండ్ చేసింది. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి యాదవ్ మాట్లాడుతూ.. ఈ రిపోర్టుపై క్యాబినెట్లో చర్చ జరగడం శుభపరిణామమని, అయితే నివేదికను ప్రజలకు కూడా అందుబాటులో ఉంచడం అత్యంత అవసరమన్నారు. ఈ సర్వే నివేదిక సామాజిక అంతరాలను తగ్గించడానికి దోహదపడుతుందని, ప్రజా సంఘాలు, మేధావులు దీన్ని అధ్యయనం చేయాలని అభిప్రాయపడ్డారు.
ప్రతి కుటుంబాన్ని కవర్ చేస్తూ రూపొందించిన ఈ సర్వేను ‘సామాజిక తెలంగాణ ఎక్స్రే’గా అభివర్ణించారు. రాజ్యాంగ లక్ష్యాలైన సమానత్వం, సామాజిక న్యాయం సాధనలో ఈ రిపోర్టు కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు మహ్మద్ బేగ్, వజీద్ సిద్ధికి, రిజ్వాన్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.