Reading Time: 2 minutes

లాకప్ గదుల గోడలకే గనుక కళ్లుండి ఉంటే, నిందితులపట్ల కొందరు పోలీసులు ఎంతటి అమానుషంగా ప్రవర్తిస్తారో చూసి కంటనీరు పెట్టేవి. వాటికే గనుక శ్రవణశక్తి ఉంటే పోలీసుల చిత్రహింసలకు నిందితులు చేసే ఆర్తనాదాలు వినలేక చెవులు మూసుకుని ఉండేవి. నేరాభియోగంపై, కొండకచొ నిరపరాధులను సైతం నిర్బంధించి, విచారణ పేరిట హింసించి, పైశాచిక ఆనందం పొందే పోలీసుల సంఖ్య మన సమాజంలో తక్కువేమీ కాదు. ఇలాంటివారి వల్ల వృత్తికి అంకితమై, చట్టానికి బద్ధులై పనిచేసే పోలీసులు తలదించుకోవలసి వస్తోంది. ఓ లాకప్ డెత్ కేసుకు సంబంధించి మదురై అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు తాజాగా వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కోవిడ్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించి దుకాణం తెరిచారన్న అభియోగంపై తండ్రీకొడుకులను అరెస్ట్ చేసిన సాత్తాంకుళం పోలీసులు వారిద్దరినీ వేధించి, వారి చావుకు కారణమైన వైనం ఎంతటి పాషాణ హృదయులనైనా కరిగించకమానదు. ఈ ఘటనకు కారణమైన తొమ్మిదిమంది పోలీసులకు ఉరిశిక్ష విధించడం ద్వారా మదురై కోర్టు చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. హింసించి చంపడమే కాదు, తమ అమానుష కాండను మసిపూసి మారేడుకాయ చేసి, సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించిన తీరును గమనించి న్యాయమూర్తే ఆశ్చర్యపోయారంటే సదరు పోలీసులు ఎంతటి ఆరితేరిన బంట్లో అర్థం చేసుకోవచ్చు.

రాత్రంతా స్టేషన్‌లో నిర్బంధించి, బట్టలూడదీసి, పైశాచికంగా దాడి చేశారనీ, లాకప్ గోడలకు అంటిన రక్తపు మరకలను నెత్తురోడుతున్న బాధితులతోనే కడిగించారని సదరు పోలీసుల అకృత్యాలను సిబిఐ తన 1500 పేజీల చార్జిషీట్ లో సవివరంగా కళ్లకు కట్టింది. దీనిని అరుదైన కేసులలో అత్యంత అరుదైనదిగా పేర్కొన్న న్యాయమూర్తి, యావజ్జీవ కారాగార శిక్షతో సరిపెడితే ఇలాంటి నేరగాళ్లకు భయం లేకుండా పోతుందని పేర్కొనడం ముమ్మాటికీ సత్యం. లాకప్ డెత్ అనే మాట నేటి సమాజంలో సర్వసాధారణమైపోయింది. దేశంలో ఎక్కడో ఒక చోట తరచూ లాకప్ మరణాలు సంభవిస్తూనే ఉన్నా, శిక్ష పడుతున్న దృష్టాంతాలు చాలా తక్కువ. శాంతిభద్రతల పరిరక్షణకు చట్టాలను ఎంత పటుతరంగా రూపొందించినా, వాటిని అమలు చేసే పోలీసు వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాజకీయ నేతల జోక్యం వంటి పలు కారణాల పుణ్యమాని, ఇప్పటికీ సామాన్యుడు పోలీసు స్టేషన్ గడప తొక్కేందుకు భయపడుతూనే ఉన్నాడు.

సాత్తాంకుళం కేసును సిబిఐకి అప్పగించడం, స్టేషన్‌లో జరిగిన అరాచకపర్వంపై ఓ మహిళా కానిస్టేబుల్ కోర్టులో కళ్లకు కట్టినట్లుగా సాక్ష్యం చెప్పడం వంటివాటి కారణంగా ఈ కేసు నిలబడగలిగింది. సాధారణంగా ఇలాంటి కేసులలో పోలీసులు ‘ముందుజాగ్రత్తలు’ తీసుకుంటారు. సాత్తాంకుళం కేసులోనూ సిసి కెమెరాల ఫుటేజీని మాయం చేశారు. దీనిపై మద్రాస్ హైకోర్టు మండిపడుతూ, సిసి కెమెరాల ఫుటేజీని భద్రపరచవలసిందిగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై తీర్పు వెలువడిన రోజే సర్వోన్నత న్యాయస్థానం పోలీస్ స్టేషన్లలో సిసి కెమెరాల ఏర్పాటు విషయమై కేంద్ర హోంశాఖ కార్యదర్శిని తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించడం యాదృచ్ఛికం కావచ్చు. కానీ, ఠాణాలలో జరిగే అరాచకాలను కళ్లకు కట్టేవి సిసి కెమెరాలే అనడంలో సందేహం లేదు. పోలీస్ కస్టడీలో హింసను అరికట్టేందుకు సుప్రీంకోర్టు 30 ఏళ్ల క్రితమే పోలీసులకు 11 మార్గదర్శకాలను జారీ చేసింది. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తికి కూడా ఆర్టికల్ 21 ప్రకారం ప్రాథమిక హక్కులు ఉంటాయని గుర్తు చేసింది. కానీ, అనేక సందర్భాలలో నిందితుడిని అదుపులోకి తీసుకునే పోలీసులు, అతని అరెస్టును చూపించరనేది జగమెరిగిన సత్యం.

సాత్తాంకుళం కేసు తీర్పుతో అయినా ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు పాలకులు నడుం బిగించాలి. పోలీసులు మార్చలేని, సాక్ష్యాలను ఏమార్చలేని విధంగా ఠాణాల్లో సిసి కెమెరాల నిఘా పెట్టాలి. దీనిని అతిక్రమించే అధికారులకు భారీ జరిమానాలు విధించాలి. పోలీస్ స్టేషన్లలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు పౌర సమాజంలోని ప్రతినిధులకు అవకాశం కల్పించాలి. అన్నింటికీ మించి, పోలీసుల మానసిక ప్రవర్తనలో మార్పు తెచ్చేలా, వారిలో మానవతావాద విలువలను ప్రోది చేస్తూ, బాధ్యతాయుతంగా మసలుకునేలా శిక్షణ గరపాలి. పోలీస్ కస్టడీలో హింస కొనసాగుతోందంటే కారణం చట్టాలు లేకపోవడం కాదు. వాటిని అమలు చేసే అధికారులలో చిత్తశుద్ధి లోపించడమే. సాత్తాంకుళం కేసులో నిందితులకు ఉరిశిక్ష పడిఉండవచ్చు గాక, కానీ, సామాన్య పౌరుడు నిర్భయంగా, నిస్సంకోచంగా పోలీస్ స్టేషన్ గడప తొక్కే రోజు వచ్చినప్పుడే ఈ కేసులో మృతులైన జయరాజ్, బెన్సిక్స్‌ల ఆత్మకు శాంతి కలుగుతుంది.