Reading Time: 4 minutes

పశ్చిమాసియా సంఘర్షణను కరోనాతో పోలుస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు భరోసా ఇచ్చే ఉద్దేశంతో చేసినవే కావచ్చు. కానీ అవి ప్రస్తుత ఆర్థిక ఒత్తిడి తీవ్రతను తక్కువ చేసి చూపించే ప్రమాదం ఉంది. స్పష్టమైన దేశీయ విధాన ప్రతిస్పందనతో కూడిన ప్రజారోగ్య సంక్షోభమైన మహమ్మారిలా కాకుండా, ఇది ముఖ్యంగా చమురు, వాణిజ్యం, వలసల ద్వారా లోతైన ఆర్థిక సంబంధాలున్న ఒక బాహ్య భౌగోళిక రాజకీయ సంక్షోభంగా గుర్తించాలి. పెరుగుతున్న ఖర్చులు, ఉద్యోగ నష్టాలను ఎదుర్కొంటున్న కార్మికులు, చిన్న వ్యాపారాలు, కుటుంబాల వాస్తవ జీవితాలకు, ‘అంతా బాగుంది’ అనే ప్రభుత్వ సందేశం అంతకంతకూ సంబంధం లేకుండా పోతున్నట్లు కనిపిస్తున్నది. చమురు, గ్యాస్ సంక్షోభం పర్యవసాన ప్రభావమే అత్యంత తక్షణ ఆందోళనకరంగా మారింది. ముడి చమురు, ఎల్‌పిజి దిగుమతులలో అధిక భాగం పశ్చిమాసియా నుండే వస్తున్నందున, భారతదేశం దానిపై ఎక్కువగా ఆధారపడటం నిర్మాణాత్మక బలహీనతలను బయటపెట్టింది.

సరఫరా గొలుసులలో అంతరాయాలు ఇప్పటికే కర్మాగారాల మూసివేతకు దారితీశాయి. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ వంటి అధిక ఇంధన వినియోగం గల రంగాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. సూరత్‌లో దాదాపు సగం యూనిట్లు మూతపడటం, లక్షలాది ఉద్యోగాలు కోల్పోవడం అనేవి విడివిడి సంఘటనలు కావు. ఇవి విస్తృత పారిశ్రామిక మందగమనానికి ముందస్తు హెచ్చరిక సంకేతాలు. దీనికి తోడు ఎల్‌పిజి కొరత, ఉత్పత్తి దైనందిన జీవితంపై ప్రభావం చూపుతూ, గృహాలు, సంస్థలను ఖరీదైన లేదా కాలుష్య కారక ప్రత్యామ్నాయాలపై ఆధారపడేలా బలవంతం చేస్తున్నది. స్థూల ఆర్థిక సూచికలు ఈ పెళుసుదనాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి. బలహీనపడుతున్న రూపాయి, తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఒక పెను సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. మూడీస్ రేటింగ్స్, ఇతర ఏజెన్సీల నివేదికలు, అధిక ఉత్పాదక వ్యయాలు, మందగించిన వినియోగం కారణంగా జిడిపి వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి విషయాలను సూచిస్తున్నాయి.

ఈ ఒత్తిడి కేవలం బాహ్యమైనది మాత్రమే కాదు. ఇది స్తంభించిపోయిన వేతనాలు, అధిక గృహ రుణాలు, అసమాన ప్రైవేట్ పెట్టుబడులు వంటి దేశీయ బలహీనతలను కూడా బయటపెడుతోంది. జిఎస్‌టి వంటి పరోక్ష పన్నులపై ఆధారపడటం కూడా ఆర్థిక సంక్షోభ సమయాల్లో ప్రభుత్వ ఆదాయాలను మరింత అస్థిరంగా మారుస్తుంది. ఇది అత్యంత అవసరమైన తరుణంలో ద్రవ్యపరమైన వెసులుబాటును పరిమితం చేస్తుంది. అంతే ఆందోళనకరంగా, మానవ సంబంధిత అంశం కూడా వెలుగులోకి వస్తుంది. ఉద్యోగాలు కోల్పోవడం, పెరుగుతున్న జీవన వ్యయాల కారణంగా వలస కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిపోవడానికి కనిపిస్తున్న తొలి సంకేతాలు, మహమ్మారి సమయంలో చూసిన దుస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. దీనిని ముందుగానే పరిష్కరించకపోతే, ఇది కీలకమైన పట్టణ పరిశ్రమలను దెబ్బతీయడంతోపాటు గ్రామీణ దుస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది.

అదే సమయంలో, గల్ఫ్ ఆర్థిక వ్యవస్థలలో ఏ విధమైన మందగమనం అయినా, లక్షలాది భారతీయ కుటుంబాలకు కీలకమైన, జీవనాధారమైన, విదేశీ మారకపు ఖాతాకు స్థిరత్వాన్ని ఇచ్చే కారకమైన విదేశాల నుండి పంపే డబ్బు (రెమిటెన్స్) ప్రవాహాలకు ముప్పు కలిగిస్తుంది. మొత్తంగా చూస్తే, ఈ సంక్షోభం కేవలం తాత్కాలిక అంతరాయం మాత్రమే కాదు, భారతదేశ ఆర్థిక స్థితిస్థాపకతకు, విధాన సంసిద్ధతకు ఒక ఒత్తిడి పరీక్ష కూడా అని స్పష్టం అవుతుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థకు మరిన్ని సవాళ్లను విసురుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యం దిశగా పని చేస్తున్న తరుణంలో భారత్ బాహ్య, అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోందని మంత్రి స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఘర్షణల కారణంగా ప్రాంతీయ భద్రతా సమస్యలు తలెత్తాయని, దీంతో భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరింత క్లిష్టంగా ఉండే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

పశ్చిమాసియా సంఘర్షణను ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు ముప్పుగా పరిణమించిన ఒక వ్యవస్థాగత ప్రకంపనగా ఆర్థిక మంత్రి అభివర్ణించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరత, అనిశ్చితి, సంక్లిష్టత, అస్పష్టతను ఎదుర్కొంటోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ప్రభుత్వ అప్పులు పెరిగాయని మంత్రి చెప్పారు. గతేడాది ఆర్థికవృద్ధి 6.8శాతంగా ఉన్న మూడీస్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను 6 శాతానికి తగ్గించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో వృద్ధి వేగం మందగిస్తోందని, ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం ఉందని మూడీస్ పేర్కొంది. యుద్ధం కారణంగా దీర్ఘకాలిక అంతరాయాలు ముఖ్యంగా ఎల్‌పిజి రవాణా కారణంగా భవిష్యత్తులో గృహాలకు ఎల్‌పిజి కొరత, అధిక ఇంధన, రవాణా ఖర్చులకు అలాగే దిగుమతి చేసుకున్న ఎరువులపై భారత్ ఆధారపడటంతో ఆహార ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని పేర్కొంది.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అధిక ధరలు, పెరిగిన ముడి సరుకుల వ్యయాల మధ్య ప్రైవేట్ వినియోగం క్షీణించడం, స్థూల స్థిర మూలధన నిర్మాణం బలహీనం కావడం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం దృష్ట్యా 2026 -27లో వాస్తవ జిడిపి వృద్ధి రేటు గతంలో 6.8 స్థాయి నుండి తగ్గి 6 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేస్తున్నాం అని మూడీస్ నేవిక తెలిపింది. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా సాగుతోందని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సిఇఎ) అరవింద్ సుబ్రమణ్యం హెచ్చరించారు. యుద్ధం వల్ల చమురు, గ్యాస్, ఎరువుల సరఫరా నిలిచిపోవడం వల్ల దేశ జిడిపి 1 శాతం పైగా పడిపోయి, ద్రవ్యోల్బణం 1.5 శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఎంతో కాలం కొనసాగవని, చివరికి సామాన్యుడిపై ధరల భారం పడక తప్పదని విశ్లేషించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన స్తబ్దత ముప్పులో ఉందని పేర్కొన్నారు. భారీ అప్పుల కారణంగా ప్రభుత్వాలకు ఆర్థికంగా నిలదొక్కుకునే శక్తి తగ్గిపోవడం ఈ సంక్షోభంలో మరో ప్రధాన ప్రతికూల అంశంగా మారే అవకాశం ఉంది. రూపాయి విలువ పతనం కావడం కూడా విధానకర్తలకు ఒక గట్టి సవాలే కాగలదు. ఒక వంక దిగుమతుల బిల్లు గణనీయంగా పెరుగుతుండగా, దేశ ఆర్థిక పటిష్టతకు సూచికగా భావించే విదేశీ మారకం నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి. మార్చి 27తో ముగిసిన వారం వ్యవధిలోనే భారత విదేశీ మారక నిల్వలు 10.29 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 95 వేల కోట్లు) తగ్గి 688.06 బిలియన్ డాలర్లకు పడిపోయాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వెల్లడించింది. అంతకుముందు వారంలో కూడా ఇవి 11.41 బిలియన్ డాలర్లు తగ్గడం ఆందోళనకరం. పశ్చిమాసియాలో చెలరేగిన ఉద్రిక్తతల ప్రభావం భారత రూపాయిపై తీవ్రంగా పడుతోంది.

విదేశీ మారకం నిల్వలు అమాంతం కరిగిపోవడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్లతో పోలిస్తే రూపాయి విలువ వేగంగా క్షీణిస్తుంది. దీనివల్ల విదేశాల నుండి మనం కొనుగోలు చేసే వస్తువులు ఖరీదవుతాయి. తద్వారా ముడి చమురు దిగుమతి ఖరీదు కావడంతో రవాణా ఖర్చులు పెరిగి, దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. యంత్రాల దిగుమతికి అవసరమైన విదేశీ కరెన్సీ లేక దేశ పారిశ్రామిక వృద్ధి మందగిస్తుంది. అంతిమంగా భారత రుణ పరపతి సామర్థ్యం దెబ్బతిని ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ పాతాళానికి పడిపోవడం, చమురు ధరలు అమాంతం పెరగడం భారతదేశ దిగుమతి బిల్లును తడిసిమోపెడు చేయనుంది. ప్రస్తుతం దిగుమతి బిల్లు ప్రస్తుతం రెండు వైపుల నుండి ముప్పును ఎదుర్కొంటోంది. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, మరోవైపు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఓ దశలో 95 కనిష్ట స్థాయికి పడిపోతోంది. ఈ రెండింటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఎదుర్కోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ సంక్షోభాన్ని ఒక గుణపాఠంగా భావించి, భవిష్యత్తులో శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిందే. ప్రభుత్వం ఇంధన పన్నులను తగ్గించడం, సరఫరాలను దారి మళ్లించడం వంటి కొన్ని స్వల్పకాలిక చర్యలు తీసుకున్నప్పటికీ, ఇవి వ్యూహాత్మకంగా కాకుండా ప్రతి చర్యాత్మకంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభం నుండి గట్టెక్కడానికి ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వీలైతే అక్కడ నుండి తక్కువ ధరకే ఇంధన, ఎరువుల నిల్వలను యుద్ధ ప్రాతిపదికన సేకరించాల్సి ఉంది. దేశీయంగా ఎక్సైజ్ సుంకాల కోత, సబ్సిడీల వంటి చర్యలు స్వల్పకాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ సుదీర్ఘ కాలం పాటు పెరిగిన భారాలను ప్రభుత్వం మోయలేదని గ్రహించాలి. చివరికి ఆ భారం సామాన్య వినియోగదారుడిపైనే వేయక తప్పదు. పారదర్శకమైన సమాచార మార్పిడి, బలహీన వర్గాలకు, కార్మికులకు లక్షిత ఉపశమనం, అస్థిరమైన బాహ్య వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఒక మధ్యకాలిక ప్రణాళిక అవసరం. ఇవి లేకుండా, వృద్ధి మందగించడమే కాకుండా, అధికారిక ఆశావాదానికి, ఆర్థిక వాస్తవికతకు మధ్య అంతరం పెరిగే ప్రమాదం ఉంది.