
నేటి ప్రపంచం డిజిటల్ మయం అయిపోయింది. ఫోన్ లేకుండా జీవితాన్ని గడపడం కష్టంగా మారింది. దీని కారణంగా మానసిక, శారీరక ఆరోగ్యం చాలా క్షీణించింది. ప్రజలు సోషల్ మీడియాలో గంటల తరబడి సమయాన్ని వృధా చేస్తున్నారు. ఉదయం నిద్రలేచింది మొదలు మొబైల్ ఫోన్‌లలో రీల్స్‌ను స్క్రోల్ చేస్తూ తమ రోజును ప్రారంభించే వారు ఎక్కువ మందే ఉన్నారు.. నిద్రలేవగానే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ చూడటం అలవాటుగా మార్చుకుంటున్నారు. కానీ, ఇది మీ ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఒక విధంగా, ఇది డిజిటల్ వ్యసనానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది మీ రోజంతా ఉండే దినచర్యపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఉదయాన్నే నిద్రలేవగానే గంటల తరబడి మొబైల్‌లో రీల్స్ స్క్రోలింగ్ (Reels Scrolling) చేసే అలవాటును నియంత్రించుకోవడానికి, మీ ఉదయాన్ని ఉత్సాహంగా మార్చుకోవడానికి ఇక్కడ కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలతో మీరు ఈ వ్యసనం నుండి బయటపడవచ్చు.
ఎందుకు ఈ అలవాటు ప్రమాదకరం?:
మనం రీల్స్ చూస్తున్నప్పుడు మన మెదడుకు తక్షణ వినోదం (Instant Gratification) లభిస్తుంది. దీనివల్ల డోపమైన్ విడుదలయ్యి, మనం మరిన్ని రీల్స్ చూడాలని ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఉదయాన్నే మెదడు అలసిపోయి, రోజంతా ఏకాగ్రత దెబ్బతింటుంది.
నియంత్రించుకునే మార్గాలు:
నో ఫోన్ జోన్ (No Phone Zone): మీ బెడ్‌రూమ్‌ను నో ఫోన్ జోన్‌గా మార్చుకోండి. నిద్రపోయే ముందు ఫోన్‌ను మరో గదిలో లేదా మీకు అందుబాటులో లేని చోట ఉంచండి. దీనివల్ల నిద్రలేవగానే ఫోన్ పట్టుకునే అవకాశం ఉండదు.
అలారం క్లాక్ వాడండి: చాలామంది ఫోన్‌లో అలారం పెట్టుకోవడం వల్లే నిద్రలేవగానే నోటిఫికేషన్లు చూసి రీల్స్‌లోకి వెళ్తుంటారు. ఫోన్‌కు బదులు సాధారణ అలారం క్లాక్‌ని వాడటం ప్రారంభించండి.
డిజిటల్ డిటాక్స్ (Digital Detox): ఉదయం నిద్రలేచిన మొదటి గంటను మీ కోసం కేటాయించండి. ఈ సమయంలో ఫోన్ చూడకుండా ధ్యానం, వ్యాయామం లేదా సూర్యరశ్మి తగిలేలా వాకింగ్ చేయడం వల్ల మెదడుకు నిజమైన శక్తి అందుతుంది.
నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి: సోషల్ మీడియా యాప్స్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయడం వల్ల ఫోన్ మిమ్మల్ని పదే పదే పిలవదు. మీకు ఖాళీ సమయం ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చూసేలా ప్లాన్ చేసుకోండి.
ప్రత్యామ్నాయ పనులు: ఫోన్ చూసే బదులు వార్తాపత్రిక చదవడం, మొక్కలకు నీళ్లు పోయడం లేదా ఆ రోజు చేయాల్సిన పనుల జాబితా (To-do list) రాసుకోవడం అలవాటు చేసుకోండి.
సమయం వెలకట్టలేనిది. ఉదయాన్నే రీల్స్ చూస్తూ మీ విలువైన సమయాన్ని, ఆరోగ్యాన్ని వృథా చేసుకోకండి. ఈ చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద సానుకూల మార్పును తీసుకువస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..